ఎస్పివి మాజీ విద్యార్థుల లేఖ
కేంద్ర మంత్రి అమిత్‌షాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ .. మాజీ విద్యార్థుల బృందం బహిరంగ లేఖ రాసింది.
సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి స్థానిక సర్దార్ పటేల్ విద్యాలరు (ఎస్పివి) యాజమాన్యం ముఖ్య అతిథిగా అమిత్‌షాను ఆహ్వానించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 237 మంది మాజీ విద్యార్థుల బృందం పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ జోషి, గుజరాత్ ఫౌండేషన్ సొసైటీకి ఈ లేఖ రాసింది.
దేశంలో విభజన పూరిత వాతావరణం నెలకొన్న సమయంలో ఇటువంటి రాజకీయ వ్యక్తిని ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు, సమైక్యవాదానికి కట్టుబడిన పాఠశాల నైతికతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్న ద్వేషం, హింసాత్మక వాతావరణం రాజ్యాంగ విలువలను విస్మరించడానికి కారణమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాల ప్రశ్నించడాన్ని నేర్పిస్తుందని, ప్రజాస్వామ్య విలువలైన అసమ్మతి, వాదన, చర్చలను ప్రోత్సహిస్తోందని అన్నారు. <br><br>స్నేహపూర్వక ప్రవర్తన, ప్రజాస్వామ్యానికి కట్టుబడటం వంటి లక్షణాలను తమకు అందించిన పాఠశాల కోసం ఈ లేఖ రాస్తున్నామని పేర్కొంది. బిజెపి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను పటేల్ స్వయంగా నిషేధించారనే వాస్తవాన్ని ప్రస్తావించారు. దేశంలో విద్వేషాలకు, హింసకు బీజం వేస్తున్న రాజకీయ శక్తులను రూపుమాపేందుకు, దేశ స్వేచ్ఛకు భంగం కలిగిస్తోన్న ఆర్ఎస్ఎస్ను పటేల్ నిషేధించారని పేర్కొన్నారు. బిజెపి నేత అయిన అమిత్‌షా ప్రస్తుత రాజకీయాలకు ప్రతినిధి అని పేర్కొన్నారు.