న్యూఢిల్లీ : 2023 వ సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్
ఆర్గానిక్ అగ్రికల్చర్ గ్రేటర్ నోయిడా ఢిల్లీ వారు దేశవ్యాప్తంగా నిర్వహించిన
జాతీయ స్థాయి జైవిక్ ఇండియా పోటీల్లో ప్రధమ స్థానం పొందిన ఆంధ్ర ప్రదేశ్ కు
గురువారం రాత్రి ఢిల్లీలో(నోయిడా) జరిగిన “బయోఫాక్ ఇండియా న్యాచురల్స్ ఎక్స్
పొ” లో అవార్డు ప్రధానం చేశారు. అత్యధిక స్థాయిలో ప్రకృతి వ్యవసాయం
ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచి
జైవిక్ ఇండియా అవార్డు కు ఎంపికైన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ
ప్రోత్సాహంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంలో శరవేగంగా దూసుకువెళ్తున్న కారణంగా
మరో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరో రెండు జైవిక్ ఇండియా అవార్డు లు
దక్కాయి.ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్
ప్రకటించిన 3 జైవిక్ ఇండియా అవార్డులను “బయోఫాక్ ఇండియా న్యాచురల్స్ ఎక్స్
పొ” లో అవార్డు గ్రహీతలు అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు జాతీయ స్థాయి
అవార్డు లతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. రాష్ట్ర
ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని
గోవర్ధన్ రెడ్డి అవార్డు అందుకున్నారు.
రాష్ట్రంలో భారీ స్థాయిలో 8 లక్షలకు పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం
చేస్తున్నారు. దేశంలో ప్రభుత్వ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ
కార్యక్రమం మరెక్కడా జరగడం లేదు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ
ప్రభుత్వాల కేటగిరీలో జైవిక్ జాతీయ స్థాయి అవార్డు కు ఎంపికైంది. ఉత్తమ
ప్రకృతి వ్యవసాయ మహిళా కేటగిరీలో బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం, చిమటావారి
పాలెం గ్రామానికి చెందిన శ్రీమతి గనిమిశెట్టి పద్మజ జైవిక్ అవార్డు
అందుకొన్నారు. పద్మజ గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతు సాధికార
సంస్థచే ఇటీవలనే మాడల్ మేకర్ గా కూడా ఎంపికైంది. ఎఫ్ పీ ఓ కేటగిరీలో అవార్డు
దక్కించుకొన్న పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన
“అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్” తరపున
పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎఫ్ పీ ఓ మేనేజింగ్ డైరెక్టర్
సురేంద్ర బాబు అవార్డు అందుకొన్నారు. ఈ సంస్థ ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రొసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడంలో ఎంతో
ప్రావీణ్యం సంపాదించింది. ఈ సంస్థ ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో గుంటూర్
విద్యానగర్ లో ఓ హోటల్ ను కూడా నడుపుతోంది. గుంటూర్, విజయవాడ కేంద్రంగా
ప్రత్యేక స్టోర్ ల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఏడాది
(2022) కూడా జాతీయ స్థాయిలో 4 జైవిక్ అవార్డు లను సొంతం చేసుకొన్న రైతు
సాధికార సంస్థ ఈ ఏడాది కూడా మూడు అవార్డులకు ఎంపిక కావడం విశేషం.