న్యూ ఢిల్లీ : ఇండియా పేరు మారనుందా? ఇండియాకు బదులు భారత్ అని అన్నిచోట్ల
రాసేలా కేంద్రం తీర్మానం తీసుకురానుందా? పార్లమెంటు ప్రత్యేక సమావేశాల
అజెండాలో ఇది కూడా ఒకటా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం
అడుగులు వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇండియా పేరు మారనుందా? ఇక నుంచి ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘రిపబ్లిక్
ఆఫ్ భారత్’గానే వ్యవహరించనున్నారా? అన్ని అధికారిక దస్త్రాలు, కార్యక్రమాలను
‘భారత్’ పేరుతోనే నిర్వహించనున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. జీ20
ఆహ్వానితులకు పంపిన లేఖల ద్వారా ఇప్పటికే ఇదే విషయమై సంకేతాలు వెలువడ్డాయి.
ఇండియా బదులు భారత్ అని రాయడంపై రాజకీయ దుమారం చెలరేగుతుండగానే కేంద్ర
ప్రభుత్వ వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 18న తేదీ నుంచి
జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ దిశగా తీర్మానం ప్రవేశపెట్టాలని
నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. న్యూ ఢిల్లీ
వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో 2 రోజులపాటు జీ-20దేశాల శిఖరాగ్ర సమావేశాలు
జరగనున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీన విదేశీ అతిథులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం
విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిండెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా
ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇలా చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా
వ్యతిరేకించాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ
సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కాంగ్రెస్
ఆరోపించింది. అయితే అధికారిక కార్యక్రమాల్లో ఇండియా పేరు భారత్‌గా మార్చటం ఇదే
తొలిసారి అని అధికారులు అంటున్నారు.