ముస్తాబవుతోంది. ఈ సమావేశాలకు సభ్యదేశాల అధినేతలతోపాటు ఇతర దేశాల అగ్రనేతలు
హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే
అధికారులకు కోతుల బెడద ఓ సవాలుగా మారింది. దీన్ని అధిగమించేందుకు సంప్రదాయ
పరిష్కార మార్గంగా ‘కొండముచ్చు’ల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా
వాటి మాదిరిగా శబ్దాలు చేసేందుకు ప్రత్యేకంగా కొందరు సుశిక్షితులను
నియమించుకోవడం గమనార్హం. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు
నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అందమైన ఫౌంటెయిన్లు, పూల
మొక్కలతో పర్యటక ప్రదేశాలు, కూడళ్లను తీర్చిదిద్దుతోంది. ఇలా ప్రతిష్ఠాత్మకంగా
నిర్వహిస్తోన్న జీ20 సమావేశాల వేళ.. అక్కడి అధికారులకు కోతుల బెడద ఆందోళన
కలిగించింది. ఇటీవల పర్యాటక ప్రదేశాల్లో వాటి సంఖ్య విపరీతంగా పెరగడం,
ఒక్కోసారి ప్రజలపై దాడులు చేస్తున్న ఘటనలు కలవరపెట్టాయి. సదస్సుకు వచ్చే
విదేశీ అతిథులకు వాటి వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని
మార్గాలను అన్వేషించారు.
ఇందులో భాగంగానే సదస్సు జరిగే వేదికలు, అతిథులు బస చేసే హోటళ్లతోపాటు అనేక
కూడళ్లలో కొండముచ్చుల భారీ సైజు కటౌట్లను ఏర్పాటు చేస్తుండటం విశేషం.
అంతేకాకుండా వాటి మాదిరిగా శబ్దాలు చేసేందుకు దాదాపు 40 మంది శిక్షణ పొందిన
సిబ్బందిని అక్కడ ఉంచడం గమనార్హం. తద్వారా కోతులు భయపడతాయని అంచనా
వేస్తున్నారు. వీటితోపాటు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు అవి ఎక్కువగా
తిరిగే ప్రాంతాల్లో వాటికి పండ్లు, కూరగాయలు ఉంచుతున్నారు. అతిథుల
కాన్వాయ్లకు అడ్డురాకుండా ఉండటం, కూడళ్లలో ఏర్పాటు చేసిన మొక్కలు, పూలను
కోతులు పాడుచేయకుండా అటవీశాఖ అధికారులతో కలిసి ఇటువంటి చర్యలు చేపట్టినట్లు
దిల్లీ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. కొండముచ్చుల కటౌట్లను
ప్రయోగాత్మకంగానే పెట్టి చూస్తున్నామని, అవి ఏవిధమైన ఫలితాలిస్తాయో చూడాల్సి
ఉందన్నారు.