రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది. జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన శివుడి విగ్రహం(Shiva statue) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం విష్కరించనున్నారు. ‘విశ్వాస్ స్వరూపం’గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొనే ఈ విగ్రహం విశేషాలేంటో చూద్దామా..!
*ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది.
*దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది.
*శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను వాడారు.
*ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ సీఎంగా ఉన్న అశోక్ గహ్లోత్, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు.
*‘‘ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించాం. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి’’ అని ఈ ప్రోగ్రామ్ అధికార ప్రతినిధి జైప్రకాశ్ మాలి అన్నారు.
*ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని మాలి పేర్కొన్నారు.
*250కి.మీల వేగంతో వీచిన గాలినైనా తట్టుకొగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించినట్టు తెలిపారు.
*ఈ పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్, జిప్ లైన్, గో కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటివి ఉన్నాయి.
*శనివారం శివుడి విగ్రహం ఆవిష్కరణ తర్వాత తొమ్మిది రోజులు (అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు) పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదాన్ పలీవాల్ వెల్లడించారు. ఈ అద్భుతమైన శివుడి విగ్రహం ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త శోభను తీసుకొస్తుందని తెలిపారు.
*శనివారం నుంచి తొమ్మిది రోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాపు రామ్‌కథను పఠించనున్నారు.