విదేశీ విద్యా సంస్థల సహకారంతో ఎడ్టెక్ కంపెనీలు అందించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని తేల్చి చెప్పాయి.
దిల్లీ: ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్ లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఖిల భారత సాంకేతిక విద్యా విభాగం(ఏఐసీటీఈ) కీలక హెచ్చరికలు చేశాయి. విదేశీ విద్యా సంస్థల సహకారంతో ఎడ్టెక్ కంపెనీలు అందించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు గురువారం రెండు అత్యున్నత సంస్థలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. ఎడ్టెక్ కంపెనీలు అందించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ప్రకటనలు చూసి మోసపోవద్దని విద్యార్థులు, ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అలాంటి ఆన్లైన్ పీహెచ్డీ ప్రొగ్రామ్‌లను యూజీసీ గుర్తించదని పేర్కొన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు పీహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి ముందు యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ఆయా పీహెచ్డీ ప్రోగ్రామ్‌ల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని సూచించాయి. అలాగే, అన్ని భారతీయ ఉన్నత విద్యా సంస్థలూ పీహెచ్డీ డిగ్రీలను ప్రదానం చేసేందుకు యూజీసీ నిబంధనలు, సవరణలను అనుసరించడం తప్పనిసరని తేల్చి చెప్పాయి. యూజీసీ, ఏఐసీటీఈ ఈ తరహా హెచ్చరికలు చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలోనూ ఎడ్-టెక్ కంపెనీలతో కలిసి దూరవిద్య, ఆన్లైన్ మోడ్‌లో కోర్సులు అందించకుండా గుర్తింపు పొందిన వర్సిటీలు, సంస్థలకు యూజీసీ, ఏఐసీటీఈ కీలక హెచ్చరికలు చేశాయి. నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజ్ ఒప్పందానికి అనుమతి లేదని పేర్కొన్నాయి.