రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, : పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రానికి శుభవార్త తెలిపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం
పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే
ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్ళు మొండికేసిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర
ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి
ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది.
రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి పోలవరం
ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన 55,548 కోట్ల రూపాయల నిధుల
గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు జవాబిస్తూ పోలవరం
ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి
చేయడానికి 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్ నిర్మాణంలో
మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని
పేర్కొన్నారు. అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును
రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం లేదని
తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో
ఇప్పటి వరకు కాంపోనెంట్ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ
వస్తోంది. కాంపోనెంట్ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్ నిర్మాణ
పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర
ప్రభుత్వానికి విన్నవించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ
పర్యటనల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, జల శక్తి
శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి తీసుకువచ్చి కాంపోనెంట్ వారీ
చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో
కాంపోనెంట్ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ
శాఖలోని వ్యయ విభాగం గత జూన్ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు మంత్రి
వెల్లడించారు.