అవాస్తవాలను ప్రచారం చేయడంలో తండ్రిని మించిన నారా లోకేష్
బీసీలపై టీడీపీ చేస్తున్న అసత్యాలను ఎండగట్టిన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా
ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని
వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వాస్తవాలను
వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేయడంతో టీడీపీ నాయకుడు నారా లోకేష్
తండ్రిని మించిపోతున్నారని వారు ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో
గురువారం నారా లోకేష్ ‘జయహో బీసీ’ సదస్సు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే
ప్రయత్నాలు చేశారని వైఎస్సార్సీపీ ఎంపీలు దుయ్యభట్టారు. ఈ సందర్బంగా దేశ
రాజధాని ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఎంపీ మోపిదేవి వెంకట రమణా రావు, పిల్లి
సుభాష్, బీదా మస్తాన్ రావు, సత్యవతి, బి. చంద్రశేఖర్ లు కలిసి శుక్రవారం
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని
అవాస్తవాలను ప్రచారం చేస్తున్న నారా లోకేష్, టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఎంపీలు
ఖండించారు.
రిషికేశ్వరి చనిపోతే లోకేష్ ఎందుకు వెళ్లలేదు..? : బీసీలను టీడీపీ
ఉద్దరించినట్లు నారా లోకేష్ ఊదరగొడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకట రమణ
మండిపడ్డారు. ఇటీవల రేపల్లెలో జరిగిన ఓ సంఘటనను అడ్డంపెట్టుకుని లోకేష్
రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపల్లెకు చెందిన అమర్నాథ్
అనే బిడ్డ చనిపోతే అతని కుటుంబాన్ని ఆదుకున్నది సీఎం వైఎస్ జగన్ మోహన్
రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. ఘటన జరిగిన
24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి
వెంటనే రూ.10లక్షలు ప్రభుత్వ సాయం, ఒక రూ.లక్ష వ్యక్తిగత సాయంతోపాటు..
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్ల స్థలం, ఇల్లు కట్టించి ఇచ్చే
బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. బాధిత కుటుంబంలోని ఆ చిన్నపిల్లను
రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడించాలని లోకేష్ ప్రయత్నించడం సిగ్గుచేటని ఎంపీ
మోపిదేవి అన్నారు. ఇక టీడీపీ హయాంలో రిషికేశ్వరి అనే అమ్మాయి ఆచార్య నాగార్జున
యూనివర్శిటీలో చనిపోతే కనీసం చంద్రబాబు, లోకేష్ ఎవరూ పరామర్శించిన
పాపానపోలేదన్నారు. మరి ఆ రోజు లోకేష్ ఎక్కడ నిద్రపోతున్నాడో చెప్పాలని ఎంపీ
డిమాండ్ చేశారు.
బీసీలకు వైసీపీ చేసిన మంచి ఇదీ : 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో
బీసీల సాధికారత, వారు ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఏం చేశారో
చెప్పాలని ఎంపీ మోపిదేవి డిమాండ్ చేశారు. అదే వైఎస్సార్ సీపీ అధికారంలోకి
వచ్చిన వెంటనే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఎదిగేందుకు సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం కల్పించారని ఎంపీ తెలిపారు.
రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, అసెంబ్లీ స్పీకర్ బీసీకి కేటాయించడం,
కేబినెట్లో దాదాపు 11 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని, రాజ్యసభకు బీసీలను
ఏనాడు టీడీపీ ఒక్కరిని కూడా పంపిన సందర్భాలు లేవని, అలాంటిది సీఎం జగన్
నలుగురిని రాజ్యసభకు పంపారన్నారు. లోక్‌సభలో ఆరుగురు బీసీలు ఎంపీలుగా
ఉన్నారని, ఇక 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్
ఛైర్మన్లు, 9 మంది జడ్పీ ఛైర్మన్లు, 9 మంది మేయర్లు, 215 మంది జడ్పీటీసీలు
బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటే ఈ సామాజిక వర్గాలపై సీఎం
జగన్‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి గత టీడీపీ
హయాంలో బడ్జెట్లో 16వేల కోట్లు కేటాయిస్తే.. 82 వేల కోట్లు వైసీపీ హయాంలో
కేటాయించామన్నారు. రూ.1.60 వేల కోట్లు వివిధ సంక్షేమ పథకాల రూపంలో బీసీలకు
ఇచ్చామన్నారు. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ బీసీలకు చేసిన మంచి ఇది. ఇక ఇది
వాస్తవం కాదు, ఇది తప్పు అని చెప్పే దమ్ము టీడీపీకి, నారా లోకేష్‌కు ఉందా అని
ఎంపీ మోపిదేవి ప్రశ్నించారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని పోరాటం : సీఎం జగన్ మోహన్ రెడ్డిని ధైర్యంగా
ఎదుర్కోలేక, కులాలను తీసుకొచ్చి, వారిని రెచ్చగొట్టి నీచ రాజకీలు చేయాలని
టీడీపీ నాయకుడు నారా లోకేష్ భావిస్తున్నాడని ఎంపీ బీదా మస్తాన్ రావు
తెలిపారు. అధికారం కోసమే చంద్రబాబు, అతని కొడుకు నారా లోకేష్ బీసీల భజన
చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యువగళం పేరుతో అబద్దాలను ప్రచారం
చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్ సీపీ
ప్రైవేట్ బిల్లు పెట్టిందని, దీనికి టీడీపీ కనీసం మద్దతు ఇవ్వలేదని ఎంపీ
మస్తాన్ రావు తెలిపారు. మరి బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే.. బీసీలను రాజ్యసభకు
ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం సాగిస్తున్నారన్నారు. బీసీలంటే వెనుకబడిన
తరగతులు కాదని, సమాజానికి వెన్నెముక వంటి వారని సీఎం జగన్ భావిస్తున్నారు.
అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం సీఎం జగన్ తీసుకొస్తున్నారని ఎంపీ
పేర్కొన్నారు.