ప్రతిపక్షాల కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడింది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఢిల్లీలో మంగళవారం జరగనున్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) సమావేశానికి
38 పార్టీలు హాజరవుతున్నాయని, ఇది తమ కూటమి మెగా ప్రదర్శన అని బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని
ఎదుర్కోవడానికి బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన నేపథ్యంలో ఈ
సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 2024లో ప్రధాని నరేంద్రమోదీ తమకు మరోసారి
సవాల్‌గా మారనున్నారనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ సహా విపక్షాలు ఏకమవుతున్నాయి. ఈ
పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎన్డీయే కూటమి సమావేశానికి పిలుపునిచ్చి ఎన్నికలకు
సమరశంఖాన్ని పూరిస్తున్నాయి. ఎన్డీఏ పరిధి గత కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తోందని
జేపీ నడ్డా అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్న ప్రధాని
మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని చెప్పారు. మోదీ ప్రభుత్వ పథకాలు,
విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా
ఉన్నట్లు తెలిపారు. ఎన్డీయే కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం
చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించారు. యూపీఏకు నాయకుడే కాదని,
బలమైన నిర్ణయాలు తీసుకునే శక్తీ లేదన్నారు. ప్రతిపక్షాల కూటమి స్వార్థ రాజకీయ
ప్రయోజనాల కోసం ఏర్పడిందన్నారు. ఎన్డీయే నుండి వెళ్లిన వారు కూడా తిరిగి
వస్తున్నారన్నారు. తమ పాలనలో అవినీతిని ఏమాత్రం ఉపేక్షించలేదని, కరోనాను
కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటి
వరకు రూ.28 లక్షలకోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీచేసినట్లు చెప్పారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్
కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి జనసేనాని హాజరవుతారని పార్టీ
వెల్లడించింది. ఎన్డీయేలోకి ఇటీవల కొత్త పార్టీలు వస్తున్నట్లు ప్రకటించాయి.
యూపీకి చెందిన సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్‌భర్ ఇటీవల
ఎన్డీయేలో చేరనున్నట్లు ప్రకటించారు. బీహార్ కు చెందిన ఓబీసీ నాయకుడు చిరాగ్
పాశ్వాన్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.