కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ వెల్లడించారు.
కేరళ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఈ విషయాన్ని
కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ వెల్లడించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ
అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని చిన్మయ మిషన్ ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. అంతకుముందు ఊమెన్ చాందీ కుటుంబ
సభ్యులు సైతం ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. చాందీ కుమారుడు చాందీ ఊమెన్
ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘నాన్న చనిపోయారు’ అని చిన్న
పోస్ట్ చేసిన ఆయన… మిగతా వివరాలేవీ తెలియజేయలేదు.
చాందీ మృతి పట్ల ప్రస్తుత కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.
ఊమెన్ చాందీ సమర్థమైన పాలకుడని కొనియాడారు. ప్రజాజీవితాల్లో ఆయన భాగమైన తీరు
అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా చాందీతో ఉన్న అనుబంధాన్ని పినరయి
విజయన్ గుర్తుచేసుకున్నారు. “ప్రజాజీవితాన్ని మేమిద్దరం ఒకేసారి ప్రారంభించాం.
ఒకే ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యాం. విద్యార్థులుగా ఉన్న సమయంలోనే మేమిద్దరం
రాజకీయాల్లోకి వచ్చాం. ఆయనకు తుదివీడ్కోలు పలకడం బాధకలిగిస్తోంది” అని విజయన్
పేర్కొన్నారు.
1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో ఊమెన్ చాందీ
జన్మించారు. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని
ప్రారంభించారు. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి
విశ్వాసపాత్రుడిగా మారారు. 1970లో 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నడూ ఆయన
వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అన్నిసార్లూ పూతుపల్లి నుంచే విజయం సాధించారు. 1977లో కే కరుణాకరన్ కేబినెట్లో
మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. రెండుసార్లు సీఎంగానూ సేవలందించారు.
2004 నుంచి 2006, 2011 నుంచి 2016 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్కసారి
కూడా పార్టీ మారకపోవడం ఆయన అంకితభావానికి నిదర్శనంగా చెబుతుంటారు.