రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
చెన్నయ్ : నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి
టీటీవీ దినకరన్‌తో కలిసి మూడవ కూటమి ఏర్పాటు చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి
పన్నీర్‌సెల్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే
దానిపై చర్చలు రాష్ట్ర రాజకీయ వార్గల్లో మొదలయ్యాయి. ఎందుకంటే ద్రావిడం అనేది
ప్రజలను మోసగించేందుకు ఉపయోగించే పదమని, అలాంటిది లేదని సీమాన్ చెబుతూ
వస్తున్నారు. పన్నీర్ ద్రావిడ పార్టీ అని చెప్పుకునే అన్నాడీఎంకేలో ఇంత కాలం
ఉన్నారు. అన్నాడీఎంకే ఏక నాయకత్వ సమస్య మొదలై పన్నీర్‌సెల్వాన్ని, అతని
మద్దతుదారులను అన్నాడీఎంకే నుంచి ఎడప్పాడి పళనిస్వామి వర్గం బహిష్కరించిన
సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినా అన్ని తీర్పులు
పళనిస్వామికి మద్దతుగా రావటంతో అన్నాడీఎంకే ఈపీఎస్ వశమైంది. ఇటీవల ఎన్నికల
కమిషన్ తన అధికారిక వెబ్సైట్లోనూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి
పళనిస్వామిని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే పార్టీ ప్రిసీడియం ఛైర్మన్
తమిళ్‌మగన్ హుస్సేన్, కోశాధికారిగా దిండిక్కల్ శ్రీనివాసన్, ఉప ప్రధాన
కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌ల పేర్లును వెబ్సైట్లో
పొందుపరిచింది.
భాజపాపై అసంతృప్తి: భాజపా ఎలాగైనా తనకు సహాయం చేస్తుందని ఇంతకాలం ఓపీఎస్
నమ్ముతూ వచ్చారు. అయితే ఏక నాయకత్వ వ్యవహారం మొదలైనప్పటి నుంచీ
పన్నీర్‌సెల్వానికి ప్రతికూలంగా అన్ని విషయాలు జరిగాయి. ఓపీఎస్, టీటీవీలను
అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని భాజపా పెద్దలు పలుమార్లు ఒత్తిడి తెచ్చినా
ఎడప్పాడి ససేమిరా అన్నారు. అంతేకాకుండా జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులు ఆయన
పక్షాన నిలవడంతో పార్టీ పూర్తిగా వశమైంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో
భాజపా కూడా వేరే మార్గం లేక పళనిస్వామితోనే కూటమి అనే నిర్ణయానికి వచ్చినట్లు
తెలుస్తోంది. 18న డిల్లీలో జరగనున్న ఎన్డీయే కూటమి పార్టీల సమావేశానికి
ఈపీఎస్నుబీజేపీ ఆహ్వానించింది. ఆయన అందులో పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి
తనకు ఆహ్వానం అందుతుందని ఓపీఎస్ భావించారు. అయితే చివరికి ఆహ్వానం రాకపోవడంతో
తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో బీజేపీ ఆయన్ను దూరం పెడుతున్నట్లు రాజకీయ
నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆయన మద్దతుదారుడు, సీనియర్ నేత వైద్యలింగం…
భాజపాను నమ్మొద్దని మొదటి నుంచే చెబుతున్నట్లు, ఇప్పుడేమైందని ఓపీఎస్ వద్ద
కసురుకున్నట్లు తెలుస్తోంది. ఇలా భాజపా నమ్మక ద్రోహం చేయడంతో భాజపా, ఎడప్పాడి
పళనిస్వామిపై పన్నీర్‌సెల్వం గుర్రుగా ఉన్నారు. వారికి వ్యతిరేకంగా
నడుచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన మద్దతుదారులు కూడా ఇటీవల విలేకర్ల సమావేశంలో
భాజపాపై అసంతృప్తిని వెల్లగక్కారు.
కీలకంగా సీమాన్ నిర్ణయం : ఈ నేపథ్యంలో భాజపా విస్మరణకు గురైన ఓపీఎస్,
టీటీవీలు తదుపరి రాజకీయ చర్యల గురించి ఆలోచిస్తున్నారు. సీమాన్‌తో కలిసి మూడవ
కూటమి ఏర్పాటు చేయాలని పన్నీర్ మద్దతుదారులు ఆయనకు చెబుతున్నట్లు సమాచారం.
పలు జిల్లాల్లో సీమాన్‌కు 10 శాతం ఓటు బ్యాంకు ఉన్నందున ఆయనతో కలిసి మూడవ
కూటమి ఏర్పాటు చేస్తే అధికార పార్టీ తర్వాత భాజపా, అన్నాడీఎంకే కూటమిని
వెనక్కునెట్టి రెండవ స్థానంలోకి రావొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా తేనిలో
ఓపీఎస్ కుమారుడు రవీంద్రనాథ్, శివగంగై లేదా రామనాథపురం, విరుదునగర్‌లో
టీటీవీ బరిలోకి దిగితే ఓట్లు చీల్చొచ్చన్నది మద్దతుదారుల అభిప్రాయం. కావున
సీమాన్‌తో కలిసి పని చేయడం మంచిదని పన్నీర్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీని గురించి ఓపీఎస్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో సీమాన్‌తో
చర్చలు జరిపి రాష్ట్రంలో మూడవ కూటమి ఏర్పాటు చేస్తారని మద్దతుదారులు
చెబుతున్నారు. దీంతోనే గత కొన్ని రోజులుగా భాజపాకు వ్యతిరేకంగా ఓపీఎస్
మాట్లాడడం ప్రారంభించారని చెబుతున్నారు. ఇకపై భాజపా, ఈపీఎస్‌ను తీవ్రంగా
వ్యతిరేకించనున్నారు. అయితే ఎప్పటికీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న
సీమాన్ ఇందుకు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అదే సమయంలో రాజకీయాల్లో
ఏదైనా సాధ్యమే, బద్ధశత్రువులు కూడా మిత్రులుగా మారుతారని రాజకీయ విశ్లేషకులు
పేర్కొంటున్నారు. ఓపీఎస్ తదుపరి రాజకీయ చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.