నేడు బెంగళూరుకు దిగ్గజ నేతల రాక
బెంగళూరు: సరిగ్గా ఐదేళ్ల కిందట విధానసౌధ ముంగిట క్లిక్‌మన్న ఆ చిత్రం అప్పటి
జాతీయ రాజకీయాలను ఆసక్తిగొలిపింది. అప్పటి కేంద్ర సర్కారును కూడా కాస్త
ఆందోళనకు గురి చేసింది. కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ సర్కారుకు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామిని అభినందించేందుకు భాజయేతర కూటమి
నేతలు కదలివచ్చారు. ఆ బృహత్తరమైన సమావేశానికి సారథ్యం వహించింది మాజీ ప్రధాని
హెచ్.డి.దేవేగౌడ. ఆ తర్వాత ఏడాదికి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినా ఆ కూటమి
ప్రభావం అంతంత మాత్రమే అని ఆ ఫలితాలతో తేటతెల్లమైంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఆ
స్నేహ చిత్రానికి చీలిక ఏర్పడింది. నేటి నుంచి బెంగళూరులో భాజపాయేతర
పార్టీలన్నీ సమావేశం కానున్నాయి. ఈసారీ లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను
నిలువరించటమే లక్ష్యం కాగా ఆ సమావేశానికి సారథి మాత్రం మారారు. తాజా విధానసభ
ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ
స్థాయిలోనూ నాయకత్వ బాధ్యత తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. కర్ణాటకలో
కాంగ్రెస్ సాధించిన సాధికారిక విజయంతో విపక్షాల్లోనూ విశ్వాసం ఇనుమడించటంతో
దిగ్గజ నేతలంతా కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి నేడు నగరానికి తరలి
వస్తున్నారు.
మారిన దేవేగౌడ మంత్రాంగం : జాతీయస్థాయిలో ఎన్నికలంటే మాజీ ప్రధాని
హెచ్.డి.దేవేగౌడ నివాసం శక్తి కేంద్రంగా మారుతుంది. దక్షిణ భారత రాష్ట్రాలతో
పాటు ఉత్తర భారతంలోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా తృతీయ కూటమిగా ఏర్పాటవ్వాలంటే
గౌడను పెద్దగా పరిగణిస్తుంటారు. 2018 ఎన్నికల తర్వాత, 2019 లోక్‌సభ ఎన్నికల
ముందు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం అందుకున్నా జేడీఎస్‌లోని లౌకిక
విధానానికి మచ్చరాకూడదని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అల్ప సంఖ్యాకులు, బీసీల
సంక్షేమ సిద్ధాంతాన్ని పార్టీ ఏజెండాగా మార్చుకున్న కాంగ్రెస్‌తో పొత్తుకే
సిద్ధమయ్యారు. ఆపై ఏడాదిన్నర కాలంలోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటంతో జేడీఎస్
డీలా పడిపోయింది. తాజా విధానసభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అంచనాలన్నీ
తారుమారయ్యాయి. జేడీఎస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు కాంగ్రెస్
వైపునకు పూర్తిగా మళ్లిపోవటంతో జేడీఎస్ ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది.
మడిగట్టుకునే సిద్ధాంతాలను పక్కనబెట్టి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు
భాజపాతో జతకట్టేందుకు దేవేగౌడ కూడా సిద్ధమయ్యారు. గతవారం రోజులుగా భాజపా మిత్ర
కూటమి ఎన్డీఏలో కలిసేందుకు జేడీఎస్ సమ్మతించటం దాదాపు ఖరారైంది.
అధిష్ఠానం-దేవగౌడలే చూసుకుంటారు : ఎన్డీఏలో జేడీఎస్ చేరే విషయంపై పార్టీ
అధిష్ఠానం, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ చర్చల తర్వాతనే స్పష్టమవుతుందని
మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పష్టం చేశారు. కుమారస్వామి ఇప్పటికే తన
అభిప్రాయాలను వెల్లడించారు. ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. లోక్‌సభ
ఎన్నికల్లో అనివార్యం అనుకుంటే జేడీఎస్‌తో జతకట్టేందుకు ప్రయత్నిస్తామని
పార్లమెంటరీ మండలి సభ్యులు బి.ఎస్ యడియూరప్ప ఇదే అంశంపై స్పందించారు.
భాజపాయేతర పార్టీల సమావేశంపై బొమ్మై స్పందిస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటి
సమావేశాలు సహజమే. వారి సామర్థయంపై విశ్వాసం లేని వారు ఇలాంటి అందరూ ఇలాంటి
కూటమిగా మారుతుంటారు. ఈ కూటమికి ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. వీరి ఎజెండా
అంతా ప్రధాని మోదీని ఎదుర్కోవటమేనని బొమ్మై వ్యాఖ్యానించారు.
పార్టీ-నేతలు : కాంగ్రెస్- సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ,
కె.సి.వేణుగోపాల్ తృణమూల్ కాంగ్రెస్-మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ,
డెరెక్ బ్రీన్ సీపీఐ-డి.రాజా సీపీఐ(ఎం)-సీతారామ్ ఏచూరీ, ఎన్సీపీ-శరద్
పవార్, జితేంద్ర అహ్వద్, సుప్రియ సులే జేడీయూ-నితీష్ కుమార్, లల్లన్
సింగ్, సంజయ్‌కుమార్ జా డీఎంకే-ఎంకె.స్టాలిన్, టి.ఆర్.బాలూ ఆప్-అరవింద్
కేజ్రీవాల్ జార్ఖండ్ ముక్తీ మోర్చా-హేమంత్ సొరేన్ శివసేన(యూబీటీ)-ఉద్దవ్
ఠాక్రె, ఆదిత్య ఠాక్రె, సంజయ్ రౌత్ ఆర్జేడీ-లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి
యాదవ్, మనోజ్, సంజయ్ యాదవ్ ఎస్పీ-అఖిలేష్ యాదవ్, రామ్‌గోపాల్ యాదవ్,
జావేద్ ఆలీఖాన్ జేకేఎన్సీ-ఒమర్ అబ్దుల్లా జేకేపీడీపీ-మెహబూబా ముఫ్తీ
సీపీఐ(ఎంఎల్)-దిపాంకర్ భట్టాచార్య ఆర్ఎల్డీ-జయంత్ సింగ్ చౌదరి
ఐయూఎంఎల్-ఖాదర్ మొహిద్దీన్, పీకే.కునాలికుట్టీ కేరళ కాంగ్రెస్(ఎం)-జోస్
కె.మణి ఎండీఎంకే-తిరు వైగో, రేణుగాదేవీ వీసీకే-తిరుమావలవలన్, రవికుమార్
ఆర్ఎస్పీ-ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, కేరళ కాంగ్రెస్-పి.జె.జోసెప్,
ఫ్రాన్సిస్ జార్జ్ కేఎండీకే-ఇ.ఆర్.ఈశ్వరన్, ఏకేపీ చిన్‌రాజ్
ఏఐఎఫ్బీ-జి.దేవరాజన్.
* వీరంతా గత మే 13న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి
హాజరయ్యారు. ఐదేళ్ల కింవదట ఏర్పాటైన కూటమి నుంచి జేడీఎస్, తెదేపా, టీఆర్ఎస్
పార్టీలు వైదొలిగాయి.*
స్థలం-తాజ్ వెస్ట్ఎండ్, బెంగళూరు(సోమ, మంగళవారం)
సమావేశం-రెండవ విపక్షాల సమావేశం
తొలి సమావేశం-జూన్ 23న పాట్నా
హాజరవుతున్న పార్టీలు-23
ముఖ్యమంత్రులు-7(దిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, పంజాబ్,
జార్ఖండ్, కర్ణాటక)
మాజీ ముఖ్యమంత్రులు-6
మొత్తం నేతలు-56
లక్ష్యం-2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను నిలువరించే ప్రణాళికలు, తృతీయ కూటమి
నాయకత్వ బాధ్యతలు, 300స్థానాల్లో తృతీయ కూటమి బలమైన అభ్యర్థుల ఎంపిక, కొత్త
పార్లమెంట్ భవన్లో సమావేశాల బహిష్కరణకు కసరత్తు, రానున్న ఆరు నెలల్లో కేంద్ర
సర్కారు విధానాలపై వ్యూహాత్మక ఆందోళన