నేడు, రేపు బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ*
ఢిల్లీ లో ఎన్డీయే పక్షాల సమాలోచనలూ రేపే
అధికార కూటమిలో 30..ప్రతిపక్షంలో 24-26 పార్టీలు
బెంగళూరు : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో దేశంలో
రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 8-9 నెలల
సమయమే మిగిలి ఉండడంతో అధికార, విపక్షాలు రెండూ తమ వ్యూహాలకు పదునుపెడుతూ
బలసమీకరణ యత్నాల్లో నిమగ్నమయ్యాయి. అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు
విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండగా అటు అధికార ఎన్డీయే కూడా తన పాత మిత్రులను
ఆహ్వానిస్తూ బలోపేతమయ్యే కసరత్తును ముమ్మరం చేస్తోంది. సోమ, మంగళవారాల్లో
బెంగళూరులో విపక్షాల సమావేశాలు జరగనుండగా, మంగళవారమే అధికార కూటమి సన్నాహక
కసరత్తు ఢిల్లీలో జరగనుండడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను
కాలరాసే ఆర్డినెన్సును తాము కూడా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన
నేపథ్యంలో విపక్ష భేటీకి తాము కూడా హాజరు కావాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)
నిర్ణయించింది. మరోవైపు తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీల్లో గట్టిపట్టున్న
నేతగా గుర్తింపు పొందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్
రాజ్‌భర్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడం తాజా పరిణామం. మొత్తంమీద సుమారు 30
పార్టీలు ఎన్డీయే వైపు, 24-26 పార్టీలు విపక్ష కూటమి వైపు ఉన్నట్లు తాజా
గణాంకాలు చెబుతున్నాయి.
ఉభయ శిబిరాల్లో ఏర్పాట్లు పూర్తి : పట్నాలో జరిగిన తొలి సమావేశం కంటే మరిన్ని
పార్టీలను ఆహ్వానించి బెంగళూరులో రెండో భేటీని పక్కాగా నిర్వహించేందుకు
కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్
అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు
నాయకులు దీనిలో పాల్గొనబోతున్నారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ఎండ్ హోటల్లో
నిర్వహించే విపక్ష నేతల సమావేశాల ఏర్పాట్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యవేక్షించారు. ఈ
సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ
(తృణమూల్ కాంగ్రెస్), బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (జేడీయూ),
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), ఝార్ఖండ్ సీఎం
హేమంత్‌సోరెన్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (ఆప్), శరద్‌పవార్
(ఎన్సీపీ), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), మహారాష్ట్ర నేతలు- ఉద్ధవ్
ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లతో పాటు ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే,
ఆర్ఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్,
కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీల నేతలు హాజరవుతారని
సమాచారం. భాజపా విధానాలపై, ముఖ్యంగా ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ఆ పార్టీ
చేస్తున్న ప్రయత్నాలపై దేశవ్యాప్త పోరుకు ఉమ్మడి ఆందోళన కార్యక్రమాన్ని ఈ
సమావేశంలో రూపొందిస్తారని తెలుస్తోంది. విపక్ష ఐక్యతను ముందుకు
తీసుకువెళ్లేందుకు చేపట్టే చర్యల్ని ప్రకటించనున్నారు.
దళితులు, ఓబీసీలపై వల : మంగళవారం జరిగే ఎన్డీయే సమావేశానికి బీజేపీ
అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షత వహిస్తారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర
హోంమంత్రి అమిత్‌షా సహా అగ్రనేతలు, వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశంలో
పాలుపంచుకుంటారు. అధికార కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలకు అదనంగా బిహార్‌కు
చెందిన చిరాగ్ పాసవాన్ (లోక్ జనశక్తి పార్టీ- రాంవిలాస్), జితన్‌రామ్
మాంఝీ (హిందుస్థాన్ అవామ్ మోర్చా), ఉపేంద్రసింగ్ కుశ్వాహా (రాష్ట్రీయ
లోక్‌సమతా పార్టీ), ముకేశ్ సహానీ (వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ)లను ఈ
సమావేశానికి ఆహ్వానించారు. ఓబీసీ నేత రాజ్‌భర్‌ను తమ శిబిరంలో చేర్చుకోవడం
ద్వారా ఓబీసీలకు, దళితులకు చేరువయ్యే ప్రయత్నాలను భాజపా ముమ్మరం
చేసినట్లయింది. ఓబీసీ జనాభా లెక్కల కోసం విపక్షం స్వరం పెంచుతూ, వివిధ
ప్రాంతీయ పార్టీలను కలగలుపుకొని వెళ్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకునేందుకు కమలనాథులు రకరకాల
ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బిహార్లలో వివిధ సామాజిక వర్గాలకు
నాయకత్వం వహిస్తున్నవారిని తమ గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా
ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించాలని పావులు కదుపుతున్నారు.