మీటింగ్‌కు రావాలని లేఖలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న వేళ
భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్డీఏ కూటమిని బలోపేతం
చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. పాత మిత్రులను తిరిగి గూటిలో చేర్చుకునేందుకు
వ్యూహ రచన చేస్తోంది. ఈ నెల 18న జరిగే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరు కావాలని
శివసేన, ఎన్సీపీ సహా చాలా రాష్ట్రాల పార్టీలకు జేపీ నడ్డా లేఖ రాశారు. ఈ
సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. ఈ భేటీ ద్వారా 2024
ఎన్నికల్లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం
చేసుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా
మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా ఎన్డీయే
తన మిత్ర పక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు యత్నిస్తోంది. ఎన్డీఏను వీడి వెళ్లిన
పక్షాలను తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు కొన్నిరోజుల నుంచి ముమ్మరంగా
ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీల్లో
గట్టిపట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఎస్ బీ ఎస్ పీ అధినేత ఓంప్రకాశ్ రాజ్
భర్ తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి
దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్లో పోస్టుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో
బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే
ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్నట్లు రాజ్ భర్ తెలిపారు.
2022 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నంచి
వైదొలిగిన రాజ్ భర్ సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేశారు.
సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ
తో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తెలిపారు. ప్రధాని
నరేంద్ర మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ధన్యవాదాలు
తెలిపారు.
ఈనెల 18న నిర్వహించే ఎన్డీయే సమావేశంలో పాల్గొనాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ
నడ్డా ఇటీవల మహారాష్ట్ర సీఎం శిందే వర్గంలోని శివసేనకు, అజిత్ పవార్
వర్గంలోని ఎన్సీపీకి సహా ప్రాంతీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఎన్డీయే
సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్‌జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు
చిరాగ్ పాశ్వాన్‌కు జేపీ నడ్డా లేఖ రాశారు. ఆహ్వానంపై స్పందించిన చిరాగ్ తమ
పార్టీ నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము పలు అంశాల్లో
బీజేపీకి మద్దతిస్తూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా
ఎన్డీయే సమావేశానికి హాజరవ్వబోతున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం శిందే
నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం, బిహార్,
యూపీ నుంచి పలు చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రాంతీయ
పార్టీలు ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీయే భేటీకి హాజరుకానున్నాయి. ప్రధాని
నరేంద్ర మోడీ కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ప్రతిపక్షాలు కూడా
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గద్దె దింపడమే లక్ష్యంగా ఏకమవుతున్నాయి.
ఇప్పటికే ఒకసారి సమావేశమైన ప్రతిపక్షాలు 18వ తేదీన మరోసారి సమావేశం
కానున్నాయి. బెంగళూరులో సోమవారం జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనే
24 పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెలలో పట్నాలో
జరిగిన మొదటి సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో
బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని విపక్షాలు ప్రకటించాయి.