నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి ఓ చిన్నారి ప్రవేశించింది. తన చేతిలో ఉన్న 10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది.
కడుపులో ఆకలి మంట. ఎదురుగా బర్గర్ షాప్. వెంటనే లోపలికి ప్రవేశించింది ఓ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక అక్కడి కనిపించిందేదో ఆర్డర్ చేసింది. తన చేతిలో ఉన్న రూ.10 నోటు తీసిచ్చింది. కానీ ఆమె ఆర్డర్ చేసింది బర్గర్. దాని ధర రూ.90. అక్కడికి కొన్ని నిమిషాల తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, చిట్టి చేతుల్లో ఇమడని బర్గర్‌ను తింటూ సంతోషంతో గెంతులేస్తూ బయటకొచ్చింది. ఇంతకీ లోపలేం జరిగిందో మనీశ్ బలానీ అనే వ్యక్తి తన లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి ఓ చిన్నారి ప్రవేశించింది. తన చేతిలో ఉన్న 10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. రూ.90 విలువైన బర్గర్ రూ.10కు రాదని చెప్పేవారే. అయితే, అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి మిగిలిన 80 రూపాయలూ తన జేబులోంచి తీశాడు. బర్గర్ అసలు ధర చెప్పకుండానే కేవలం పది రూపాయల నోటును తీసుకుని బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి నవ్వుతూ బయటకొచ్చిందంటూ బలానీ రాసుకొచ్చారు. అక్కడే ఉన్న ఓ జర్నలిస్టు అమాయకంగా బర్గర్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ బలానీ పెట్టిన లింక్డిన్ పోస్ట్‌కు వేల సంఖ్యలో రియాక్షన్స్, వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ‘మంచిని తన పోస్ట్ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు, ఉద్యోగి వివరాలు కూడా తెలియజేసుంటే బాగుండేద’ని ఓ యూజర్ రాసుకొచ్చారు. కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. బర్గర్ కింగ్ బ్రాండ్ ప్రమోషన్ అని కొందరు కొట్టి పారేయగా.. ఇది పెయిడ్ ప్రమోషన్ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. వీటికీ బలానీ స్పందించారు. ‘ఈ ఎపిసోడ్‌కు గానూ తనకు చెల్లిస్తారేమో’ అంటూ వెటకారంగా బదులిచ్చారు. కాగా.. చిన్నారికి తన సొంత డబ్బులతో బర్గర్ కొని పెట్టిన రెస్టారెంట్ మేనేజర్ ధీరజ్ కుమార్‌ను బర్గర్ కింగ్ సన్మానించింది. నలుగురికీ స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడింది. సంబంధిత పోస్ట్‌ను ట్విటర్లో పోస్ట్ చేసింది.