భారత నావికాదళం కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. సాయుధ బలగాలను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
భారత నావికాదళం కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ‘అత్యంత జాగ్రత్తగా’ వ్యవహరించమని సాయుధ బలగాలకు చెప్పాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మరోవైపు ఈ ఘటనపై భారతీయ నేవీ విచారణ చేపట్టింది. ఒక అనుమానాస్పద బోటు భారతీయ ప్రాదేశిక జలాలను దాటుతుండగా గమనించిన సిబ్బంది ఆగమని కోరారని, కానీ, ఆ వ్యక్తి నేవీ అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు పోతుండటంతో రబ్బర్ బుల్లెట్‌తో కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. గాయపడిన మత్స్యకారుడిని హెలికాప్టర్లో రామనాథపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
తాజా ఘటన బంగాళాఖాతంలోని గల్ఫ్ఆఫ్ మన్నార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మత్స్యకారులు తరచూ ఈ ప్రాంతంలోనే భారతీయ జలాలను దాటేసి వెళ్లిపోతుంటారు. అందువల్ల ఇక్కడ నిఘా ఎక్కువగా ఉంటుంది. అటు శ్రీలంక మత్స్యకారులు, ఇటు భారతీయ మత్స్యకారులు అనుకోకుండా ప్రాదేశిక జలాలను దాటుతున్నారని, దీనిని ఇరుదేశాల ప్రభుత్వాలు గౌరవించాలని మత్స్యకారులు కోరుతున్నారు. మరోవైపు ప్రస్తుతం శ్రీలంక అధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపాన్ని తిరిగి తమ పాలన కిందికి తీసుకురావాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. దీనిని 1970లో భారత ప్రభుత్వం శ్రీలంకకు బహుమతిగా ఇచ్చేసింది. ఒకవేళ దానిని తిరిగి సాధించినట్లయితే భారత జాలర్లకు చేపలు పట్టుకునే విస్తీర్ణం పెరుగుతుంది. భారత మత్స్యకారులు లంక జాలాల్లో చేపలు పట్టేందుకు వీలుగా భారత్-శ్రీలంక మద్య దీర్ఘకాలిక లీజు ఒప్పందం చేసుకోవాలని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లో ప్రతిపాదించారు.