ఆయన జీవితం ఊహించని మలుపుల సమాహారం
మరోసారి కర్ణాటక పీఠంపై పేదల ప్రతినిధి
బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు ఇటీవల ఒక్కొక్కటిగా వెలువడుతుండగా
కాంగ్రెస్ విజయం ఖరారవుతూ వచ్చింది. గెలిచిన కాంగ్రెస్ నేతలంతా సంబరాల్లో
మునిగి తేలుతుంటే సిద్ధరామయ్య మాత్రం మౌనముద్రలోనే ఉన్నారు. ఒక ట్వీట్, మరో
వ్యాఖ్యతో విజయాన్ని పంచుకున్నారు. అప్పటి నుంచి వారం రోజులుగా నోరు మెదిపిందే
లేదు. మరోవైపు తనతో పాటు ముఖ్యమంత్రి పీఠానికి పోటీపడిన డీకే శివకుమార్..
వరుసబెట్టి విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. అధిష్ఠానంపై అలకలు, బెంగళూరులో,
దిల్లీలో ఎన్నెన్నో యుక్తులు ప్రదర్శించారు. చివరకు సిద్ధరామయ్యే తదుపరి
ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ ఒక్క సందర్భం చాలు
సిద్ధరామయ్య ఎంతటి గంభీరమైన రాజకీయ నాయకుడో చెప్పేందుకు. తన వ్యూహాలేమిటో
ప్రత్యర్థుల ఊహకు అందకుండా చేయటమే సిద్ధరామయ్య విజయం సూత్రం. రామకృష్ణ హెగ్డే,
హెచ్.డి.దేవేగౌడ వంటి ఉద్దండుల నీడలో ఎదిగినా.. వారి ప్రభావం పడకుండా
జాగ్రత్తపడుతూ కర్ణాటక రాజకీయ చరిత్రలో తనకొక ప్రత్యేక స్థానాన్ని
సృష్టించుకోగలిగారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివార ప్రమాణస్వీకారం చేయబోయే 76
ఏళ్ల సిద్ధరామయ్య జీవితంలోని ఆసక్తికరమైన అంశాలివీ
తండ్రి వద్దంటున్నా : ఎల్ఎల్బీ చదివే రోజుల్లో తనకు పాఠాలు చెప్పే
ప్రొఫెసర్ నంజుండస్వామి స్ఫూర్తితో రైతు సంఘాల పోరాటాల్లో పాల్గొన్న
సిద్ధరామయ్య.. ఆయన సూచనతో 1978లో మైసూరు తాలూకా బోర్డు ఎన్నికల్లో పోటీ
చేయాలనుకున్నారు. అనుమతి కోసం తండ్రి సిద్ధరామేగౌడ వద్దకు వెళ్లగా చీవాట్లు
ఎదురయ్యాయి. అప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తండ్రి
కుమారుడికి హితబోధ చేశారు. బాగా చదువుకున్నావు.. ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా
ఉండాలన్న సూచనతో జూనియర్ న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత తనకు
ఇష్టమైన రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే బోర్డు
ఎన్నికల్లో గెలిచిన సిద్ధరామయ్యకు స్థానికంగా గుర్తింపు వచ్చింది. మరో
ఐదేళ్లకు విధానసభ ఎన్నికలు రాగా భారతీయ లోక్‌దళ నుంచి పిలుపొచ్చింది.
కార్యకర్తల ఒత్తిడితో 1983లో మైసూరులోని చాముండేశ్వరి క్షేత్రం నుంచి పోటీ
చేసి గెలిచారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన సిద్ధరామయ్య గెలుపు
స్థానికంగా పెను సంచలనంగా మారింది. అలా మొదలైన రాజకీయ ప్రయాణంలో వెనుతిరిగి
చూడలేదు.
అధ్యక్షుడితో మొదలై.. ముఖ్యమంత్రిగా : 1983లో ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధరామయ్య
అనంతరం జనతా పార్టీలో చేరారు. ఈ పార్టీలో కొత్తగా ఏర్పాటు చేసిన కన్నడ
పరిరక్షణ సమితికి అధ్యక్షులుగా నియమితులైన సిద్ధరామయ్య అదే క్రమంలో అత్యున్నత
పదవులను సులువుగా దక్కించుకున్నారు. రెండోసారి చాముండేశ్వరి నుంచి గెలిచిన
సిద్ధరామయ్య రామకృష్ణ హెగ్డే మంత్రివర్గంలో పశు సంవర్ధక మంత్రిగా, పట్టు,
రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఓడిన సిద్ధరామయ్య.. జనతాపార్టీ
నుంచి జనతాదళ్‌లో చేరి అక్కడా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. జనతాదళ్
చీలికతో అవతరించిన జేడీఎస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా 1994 ఎన్నికల్లో
విజయం సాధించి హెచ్.డి.దేవేగౌడ మంత్రివర్గంలో తొలిసారిగా ఆర్థికమంత్రి
బాధ్యతలు చేపట్టారు. 1996-1999 వరకు తొలిసారి, 2004-2005 వరకు కాంగ్రెస్,
జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. 1990, 1999
ఎన్నికల్లో ఓడిపోయిన సిద్ధరామయ్య రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నారు. అదే
చేసి ఉంటే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయేవారేమో.
దేవేగౌడతో రాజకీయ వైరం : జేడీఎస్‌లో దేవేగౌడ కుటుంబ రాజకీయాలతో విసుగెత్తిన
సిద్ధరామయ్య.. అహింద (బడుగు)లతో ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసి తనదైన రాజకీయ
వర్గాన్ని సృష్టించుకున్నారు. సమాంతర నాయకత్వాన్ని జీర్ణించుకోలేని దేవేగౌడ
ఆయనను 2006లో పార్టీ నుంచి బహిష్కరించారు. భాజపా నుంచి ఆహ్వానం అందినా
కాంగ్రెస్ పార్టీ వైపే సిద్ధరామయ్య అడుగులు వేశారు. 2008 ఎన్నికల్లో గెలిచి
సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 2013లో కాంగ్రెస్‌కు 122 సీట్లతో విజయాన్ని
అందించగా అధిష్ఠానం సీఎంగా ఆయనకే అవకాశమిచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ
డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రి పదవి విషయంలో పోటీ ఉన్నా, ఐక్యంగా పనిచేసి
పార్టీని గెలిపించడంలో సిద్ధూ కీలక పాత్ర పోషించారు.
గొర్రెల కాపరి.. 13 సార్లు బడ్జెట్ : 1994 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన
సిద్ధరామయ్య అప్పటి ముఖ్యమంత్రి దేవేగౌడ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ బాధ్యతలు
చేపట్టారు. ఆయన ఆర్థికమంత్రి అనగానే ఓ గొర్రెల కాపరి (కురుబ సముదాయానికి
చెందినవారు) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారా? అని ప్రత్యర్థులే కాదు
పార్టీలోని సహచరులూ ఎద్దేవా చేశారు. ‘వారన్నమాటలు నాలో కసిని పెంచాయి.
న్యాయవాద వృత్తిలో ఉన్నా రాష్ట్ర బడ్జెట్‌పై అధ్యయనాలు చేసి పకడ్బంధీగా
బడ్జెట్లు ప్రతిపాదించేవాడినని సిద్ధరామయ్య చెబుతారు.
నీతిమంత రాజకీయం : ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా పని చేసినా ఇతర
నేతలతో పోలిస్తే సిద్ధరామయ్యకు అవినీతి ఆరోపణలు దాదాపు లేనట్లే. ఒకటి రెండు డీ
నోటిఫికేషన్ ఆరోపణలున్నా అవి సిద్ధరామయ్య ప్రతిష్ఠకు భంగం కలిగించలేదు. ఆయనకు
ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నా వారంతా ఇప్పటికీ ఓ సాధారణ రైతు
కుటుంబాలుగానే జీవిస్తుండటం విశేషం. తనకు అవినీతి మరక అంటకపోవటానికి నా కుటుంబ
సభ్యుల నిరాడంబర జీవితాలే కారణమని పలుమార్లు సిద్ధరామయ్య చెబుతుంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమోదైన అవినీతి ఆరోపణలు కనిపించకూడదనే 2016లో
లోకాయుక్తను రద్దు చేశారన్న వాదన నేటికీ వినిపిస్తుంటుంది. 40 ఏళ్ల రాజకీయ
ప్రయాణంలో 10 సార్లు విధానసభకు పోటీ చేయగా 7సార్లు విజయం సాధించారు.