జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్
సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య
తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే వాళ్ల ప్లాన్ అన్న ఇమ్రాన్
ఇస్లామాబాద్ : దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్
ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తెల్లవారు
జామున సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. లండన్ ప్లాన్
బహిర్గతమైందని, తన చివరి రక్తపు బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడుతానని
చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి, వారు న్యాయమూర్తి,
జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ పాత్రలను పోషించారన్నారు. తన భార్య బుష్రాని జైలులో
పెట్టడం ద్వారా తనను అవమానపరిచే ప్రయత్నం చేశారన్నారు. పదేళ్లపాటు తనను జైలు
లోపల ఉంచేందుకు కొన్ని దేశద్రోహ చట్టాలను ప్రయోగించే ప్లాన్ ఉందన్నారు. తనకు
మద్దతుగా నిరసనలు తెలిపే వారిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ పార్టీ
కార్యకర్తలతో పాటు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మీడియాను
నియంత్రిస్తున్నారన్నారు. ఎందుకంటే రేపు తనను మళ్లీ అరెస్ట్ చేసినప్పుడు వారు
బయటకు రాకూడదని భావిస్తున్నారన్నారు. అవసరమైతే ఇంటర్నెట్ సేవలు
నిలిపివేస్తారన్నారు. అయితే, తన చివరి రక్తపు బొట్టు వరకు స్వేచ్ఛ కోసం
పోరాడుతానన్నారు.
మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో
పొరుగుదేశం పాకిస్థాన్ అట్టుడుకింది. ఇమ్రాన్ అరెస్టు అక్రమమని పాక్
సుప్రీంకోర్టు తేల్చి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల
మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య
చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.
అవినీతి కేసులో అరెస్టైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత
ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు రెండు వారాల పాటు
బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్ ఖదీర్
ట్రస్టు భూముల కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు
చేసింది. దీంతో ఇమ్రాన్‌కు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించింది. మే 9 తర్వాత
ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన ఏ కేసులోనూ ఆయనను మే 17 వరకు అరెస్ట్ చేయవద్దని
ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించినట్లు పాక్ మీడియా పేర్కొంది.