బెంగళూరు : సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియామకంపై రాజకీయ విమర్శలు
వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, వేధింపులకు గురి
చేసేందుకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న
ఆరోపణలు వెల్లువెత్తుతుండగా తాజాగా సీబీఐ డైరెక్టర్‌గా బీజేపీ ప్రభుత్వం తమ
నమ్మిన బంటును నియమించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు కర్ణాటక
డీజీపీగా పనిచేసిన ప్రవీణ్ సూద్ అక్కడ అధికార బీజేపీ పట్ల సానుకూల వైఖరిని
అవలంబించినట్టు ఆరోపణలున్నాయి. తన హయాంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి
ప్రతిపక్షాలపై అనేక కేసులను మోపి వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులతో
విసిగిపోయిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో
ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆయన ఈ పదవికి పనికిరారు’ అని ఘాటు విమర్శలు
చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీజీపీ ప్రవీణ్‌ను కచ్చితంగా అరెస్ట్
చేస్తామని హెచ్చరించారు. యాదృచ్చికంగా కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన
రోజునే ప్రవీణ్‌ను సీబీఐ డైరెక్టర్‌గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించడం
గమనార్హం. దీంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకే ప్రవీణ్‌ను తెరపైకి
తెచ్చారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ప్రవీణ్ సూద్‌ను ఎంపిక చేసిన కమిటీలో
సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదురీ కూడా ఆయన నియామకంపై
విమర్శలు గుప్పించారు. ఆయనకు ఆ అర్హత లేదని చెప్పారు. ఈ నెల 25న సూద్
బాధ్యతలు చేపట్టనున్నారు.