అవినీతిపై విచారణకు డిమాండ్
మాదీ 40% కమీషన్ సర్కారే.. రాష్ట్ర మంత్రి ఒప్పుకోలు
జైపూర్ : రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది.
అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర నిర్వహించిన పైలట్ ఈ
నెలాఖరులోగా తన డిమాండ్లను నెరవేర్చాలని హెచ్చరించారు. తమది కూడా 40శాతం
కమీషన్ ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రి సంచలన ప్రకటన చేశారు. రాజస్థాన్‌లో
గెహ్లాట్ కూడా 40 శాతం కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారని సైనిక్ వెల్ఫేర్
మంత్రి రాజేంద్ర గుఢా ఆరోపించారు. కమీషన్ అప్పజెప్పనిదే ఫైళ్లు ముందుకు కదలడం
లేదని విమర్శించారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకు సచిన్ పైలట్ చేపట్టిన ఐదు
రోజుల పాదయాత్ర సోమవారం ముగిసింది. మంత్రి గుఢా సహా 15 మంది ఎమ్మెల్యేలు
పైలట్‌కు మద్దతుగా ఇందులో పాల్గొన్నారు.
అవినీతిపై విచారణ చేపట్టాలి
జైపూర్ సభలో సచిన్ పైలట్ మాట్లాడుతూ గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన
అవినీతిపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, దాని పునర్వ్యవస్థీకరణను రద్దు
చేయాలని కోరారు.
మాది అవినీతి సర్కార్
కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ ప్రభుత్వం మాదిరిగానే రాజస్థాన్‌లోనూ
గెహ్లాట్ 40 శాతం కమీషన్ సర్కార్‌ను నడిపిస్తున్నారని మంత్రి రాజేంద్ర గుఢా
ఆరోపించారు. తమ ప్రభుత్వం సరైన దారిలో నడవడం లేదని, కమీషన్ లేనిదే ఫైల్స్
కదలవని విమర్శించారు. తాము పార్టీ విడిచివెళ్లిపోవాలని గెహ్లాట్
అనుకుంటున్నారని, కానీ పార్టీలోనే కొనసాగుతామని, మీ వెంటే ఉంటామని ఎమ్మెల్యేలు
పైలట్‌కు మద్దతు పలికారు.