కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య? ఖర్గే ప్రకటించే ఛాన్స్!
మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యనే కోరుకుంటున్నారని నివేదిక
అధ్యక్షుడికి పరిశీలకుల నివేదిక
ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడి
బెంగుళూరు : కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. కాంగ్రెస్
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతికి సీఎం ఎంపిక బాధ్యతలను
కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలు అప్పగించారు.
నేను బ్లాక్మెయిల్ చేయను
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరైన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు.
ఉదయమే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్ రాత్రి ఢిల్లీకి
బయలుదేరుతారని వార్తలు వచ్చాయి. తాను తన గురువును కలిసిన తర్వాత ఢిల్లీకి
వెళ్తానని కూడా ఆయన మధ్యాహ్నం ప్రకటించారు. కానీ సాయంత్రానికి ఢిల్లీ పర్యటనను
క్యాన్సిల్ చేసుకొని ట్విస్ట్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తాను ఢిల్లీకి
వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని చెప్పిన డీకే
శివకుమార్ సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. మీరు కర్ణాటకలో
పార్టీని గెలిపిస్తారని నాకు నమ్మకముందని సోనియా గాంధీ తనతో అన్నారని, నేను
ఇక్కడ కూర్చొని, తన బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. మనం కృతజ్ఞతగా,
మర్యాదగా ఉండాలన్నారు. ఈ గెలుపు వెనుక ఎవరున్నారనే అభిమానం వారికి
ఉండాలన్నారు. తిరుగుబాటు చేస్తారా అని ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పారు.
తాను తిరుగుబాటు చేయనని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడనని చెప్పారు. తనకంటూ సొంత
వ్యక్తిత్వం ఉందని, తానేం చిన్న పిల్లాడిని కానని చెప్పారు. తాను ఎవరి ట్రాప్
లో పడనని చెప్పారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య? ఖర్గే ప్రకటించే ఛాన్స్!
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం
ఉందని సోమవారం ఓ నివేదిక వెల్లడైనట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
న్యూస్ 18 ప్రకారం మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా
కోరుకుంటున్నారు. కానీ, కర్ణాటక సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా అధికారికంగా
ప్రకటించలేదు. నేటి రాత్రి కాంగ్రెస్ పరిశీలకులు తమ నివేదికను పార్టీ చీఫ్
మల్లికార్జున్ ఖర్గేకు అందజేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్
సూర్జేవాలా తెలిపారు. ఎమ్మెల్యేలందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని
పరిశీలకుల్లో ఒకరైన జితేంద్ర సింగ్ తెలిపారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం జరిగిందని, తాము ఒక నివేదికను సిద్ధం
చేశామని, దానిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి అందిస్తున్నామని పరిశీలకులు
అన్నారు. కొత్త సీఎంను ఎన్నుకోవడానికి శాసన సభా పక్ష సమావేశం అవుతుంది. ఇందుకు
సంబంధించి ముగ్గురు పరిశీలకులను సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్
బబారియాలను నియమించింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్
హుస్సేన్ ఈ రోజు మాట్లాడుతూ సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరూ కూడా
కాంగ్రెస్ సీనియర్ నాయకులేనని, ఇద్దరూ ముందుండి కర్ణాటకలో పార్టీ కోసం పని
చేశారని, నాయకత్వం వహించారని వ్యాఖ్యానించారు. పార్టీని బలోపేతం చేయడానికి
ఇద్దరూ తమ శాయశక్తులా కృషి చేశారన్నారు. అయితే కర్ణాటక సీఎం ఎవరు అవుతారో
చూద్దామని, సీఎల్పీ అభిప్రాయం ఏమిటో చూద్దామన్నారు.