మల్లికార్జున ఖర్గే చేతికి నివేదిక
బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణను పూర్తి చేసిన పరిశీలకులు
నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై స్పందించేందుకు నిరాకరించిన కర్ణాటక పీసీసీ చీఫ్
డీకే శివకుమార్ తాను ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు
దిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని శివకుమార్ స్పష్టం చేశారు. అయితే
సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
కన్నడ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజారిటీ సాధించిన
కకాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతుంది.
పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పోటీ పడడమే అందుకు
కారణం. ఇప్పటికే సీఎల్పీ సమావేశం నిర్వహించి 135 మంది ఎమ్మెల్యేల
అభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల బృందం నివేదికను సిద్ధం
చేసింది. అయితే ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గేకు అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఢిల్లీ చేరుకోనున్న పరిశీలకుల బృందం ఖర్గేకు నివేదిక అందివ్వనుంది. అనంతరం
కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రకటించనుంది. ఈ నెల 18నే కొత్త
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం
అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు
మల్లికార్జున ఖర్గే కర్ణాటక పుత్రుడన్న రణదీప్ సుర్జేవాలా ముఖ్యమంత్రిని
నిర్ణయించేందుకు ఆయనకు ఎక్కువ సమయం పట్టబోదని తెలిపారు. మరోవైపు కర్ణాటక సీఎం
పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం
చేశారు. బెంగళూరులోని షాంగ్రీలా హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. డీకే
శివకుమార్ కలిసి మంతనాలు చేశారు. సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో
రహస్య మంతనాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.