హైదరాబాద్ : విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే
సిపిఐ లక్ష్యం అని, అందుకోసం సిపిఐ ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు నెల రోజులు
దేశంలోని అన్ని రాష్ట్రాలలోని మహానగరాలు, పట్టణాలు, గ్రామాలలో “బీజేపీ హటావ్ –
దేశ్ బచావ్” నినాదంతో పాదయాత్రలు నిర్వహించి బీజేపీ ప్రజా వ్యతరేక, వినాశకరమైన
విధానాలను ప్రజలకు వివరించి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి
దించాలని విజ్ఞప్తి చేస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ
వెల్లడించారు. హైదరాబాద్ మూసారాం బాగ్, ఆస్మాన్ గఢ్, టివి టవర్, బి బ్లాక్స్,
తిరుమల హిల్స్, వికె దాగే నగర్, బ్యాంకు కాలనీ తదితర బస్తీలు, కాలనీలలో
ఆదివారం “బీజేపీ హటావ్ – దేశ్ బచావ్” నినాదంతో సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి
పాదయాత్ర నిర్వహించింది.
డా. కె. నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ,
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, సిపిఐ హైదరాబాద్ జిల్లా
కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం తోపాటు
వందలాదిమంది సిపిఐ శ్రేణులు దుకాణాలు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ
బీజేపీ ప్రజా వ్యతరేక విద్వంసక విధానాలను వివరించారు. ఈ సందర్బంగా డా. కె.
నారాయణ మాట్లాడుతూ దేశమంతటా మత విషాన్ని వ్యాపింపజేస్తూ బీజేపీ పార్టీ ప్రజలు
ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అని హుకుం జారీచేస్తే
ప్రజలు ఊరుకోరని కర్ణాటక మాదిరిగానే దేశమంతటా తరమికొడుతారని తెలిపారు.
కర్ణాటకలో మోడీ అమిత్ షా లు ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన బీజేపీ
అవమానకరమైన ఓటమి చెందడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ఈడి,
సిబిఐ, ఐటి డిపార్ట్మెంట్లను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని
ఆరోపించారు. ప్రధాని మోడీ తాను చేసిన హామీలన్నీ విస్మరించాడని అయన
దుయ్యబట్టారు.
ప్రజలను పేదరికం మరియు వెనుకబాటు నుండి బయటికి నడిపించడంలో మోడీ ప్రభుత్వం
ఫుర్తిగా విఫలమైందని అయన విమర్శించారు. రెండు పర్యాయాల బీజేపీ కేంద్ర
ప్రభుత్వం దేశ సంస్కృతి, నైతికత, ప్రజా సంస్థలు, ప్రజాస్వామ్య నిర్మాణం మరియు
రాజ్యాంగ విలువలకు అపారమైన నష్టం కలిగించిందని మండిపడ్డారు. లౌకికవాదం,
ప్రజాస్వామ్యం మరియు ఫెడరలిజం యొక్క రాజ్యాంగ ఆదేశాన్ని పరిరక్షించడం కోసం
ప్రగతిశీల, ప్రజాసామ్యవాదులందరు ఏకమై బీజేపీ వినాశకరమైన విధానాలు ప్రజలకు
తెలిపి, చైతన్య పరిచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా
ఓడించడానికి కృషి చేయాలనీ డా. కె. నారాయణ పిలుపునిచ్చారు. ఈ.టి. నరసింహ
మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తూ దాని లక్ష్యాలను సాధించడానికి
చట్టాలను కూడా ఉల్లంఘించడానికి వెనుకాడని నియంతృత్వ, మెజారిటీ రాజ్యాన్ని
నిర్మించడానికి బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
దేశాన్ని పీడిస్తున్న వివిధ ఆర్థిక రుగ్మతల నుండి కాపాడకుండా కేవలం బీజేపీ తన
విభజన విధానాలు, మతతత్వ, ఫాసిస్ట్ రాజకీయ వ్యవస్థ స్థాపనకు మార్గం సుగమం
చేయడమే కోసమే పాలనా కొనసాగిస్తుందని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ
ప్రభుత్వం భారీగా సంక్షేమ నిధులను తగ్గించడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కుంటున్నారని అయన తెలిపారు. బీజేపీ నియంతృత్వ పాలనా నుండి దేశాన్ని
కాపాడుకోవలసిన అవసరం ఏర్పడిందని, ప్రజలు బీజేపీ తప్పిదాలను గమనించి వచ్చే
ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఈ.టి. నరసింహ విజ్ఞప్తి చేసారు. ఈ
పాదయాత్రలో సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్,
జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్ గౌడ్, నిర్లేకంటి శ్రీకాంత్,
కంపల్లి శ్రీనివాస్, సిపిఐ నగర నేతలు మన్నన్, గ్యార నరేష్, బైరగోని రాజు గౌడ్,
మహమూద్, ఒమర్ ఖాన్, లతీఫ్, సిహెచ్. జంగయ్య, ఎండి. సలీమ్, మునీర్ పటేల్, అనిల్
కుమార్ తదితరులు పాల్గొన్నారు.