బెంగళూరు : చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ప్రశాంతంగా ముగిసింది. అందిన సమాచారాన్ని బట్టి 65.69శాతం మంది ఓటర్లు తమ ఓటు
హక్కు వినియోగించుకున్నారు. శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు అదే
రోజు మధ్యాహ్నానికల్లా వెలువడనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన
రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేస్తామని బిజెపి భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందని
కాంగ్రెస్ ఆశిస్తోంది. 61స్థానాల్లో పట్టు కలిగిన జెడిఎస్ కీలక పాత్ర
పోషించే అవకాశం వుంది. 224 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో
బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మొత్తంగా 2,165మంది
అభ్యర్థులు బరిలో వున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతతో సహా వృద్ధులు
కూడా పెద్ద సంఖ్యలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటినుండే ఓటు వేసే
అవకాశం వుందన్న విషయాన్ని తమకు తెలియజేయలేదని, అందువల్లే పోలింగ్ కేంద్రాలకు
ఇబ్బందిపడి రావాల్సివచ్చిందని సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఫిర్యాదు
చేశారు. మరోవైపు, బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ రాజకీయ ప్రముఖులు తమ ఓటు
హక్కును వినియోగించుకున్నారు. అలాగే కన్నడ సినీ తారాగణం కూడా తరలి వచ్చి తమ
ఓటు హక్కును వినియోగించుకుంది. ముఖ్యమంత్రి బమ్మైతో సహా రాజకీయ ప్రముఖులందరూ
ఓటు వేశారు. జెడిఎస్ కింగ్ మేకర్ కాదని కింగ్ అవుతుందని మాజీ సిఎం
కుమారస్వామి వ్యాఖ్యానించారు. బిదాడిలో ఆయన తన ఓటు వేశారు. ఈసారి ప్రజలు
పారదర్శక ప్రభుత్వం కావాలనుకుంటున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. 2018 అసెంబ్లీ
ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36శాతం నమోదైంది.