దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన చిత్రం
పశ్చిమ బెంగాల్ లో నిషేధం
ఇది వక్రీకరించిన కథ అన్న మమతా బెనర్జీ
కోల్ కతా : ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రం
దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. వివిధ పార్టీలు, ముస్లిం సంఘాలు ఈ
సినిమాలను వ్యతిరేకిస్తున్నాయి. దాంతో అనేకచోట్ల ఈ సినిమా ప్రదర్శనలను థియేటర్
యాజమాన్యాలే నిలిపివేస్తున్నాయి. కేరళలో అదృశ్యమైన 32 వేల మంది అమ్మాయిలు
చివరికి ఎక్కడ తేలారన్నది ఈ చిత్ర కథాంశం. మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద
కార్యకలాపాలకు పాల్పడినట్టు ఈ చిత్రంలో చూపించారు. ది కేరళ స్టోరీ చిత్రానికి
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
నిషేధం విధించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ది కేరళ స్టోరీ
సినిమా వక్రీకరించిన కథ అని పేర్కొన్నారు. ఈ సినిమా వివాదాలు రెచ్చగొట్టేలా
ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకునే నిషేధం విధించామని
మమతా బెనర్జీ స్పష్టం చేశారు.