భద్రాచలం : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కాకుండా ఆదివాసీల గోడు
వినాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్
జాతీయ నాయకురాలు బృందా కారాట్ డిమాండ్ చేశారు. ఆదివాసీ పదం అంటే ప్రధాని
మోడీకి భయమని, అడవి బిడ్డల హక్కులపై భాజపా దాడి చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,
మాజీ ఎంపీ డా.మిడియం బాబూరావు అధ్యక్షతన ఈ నెల 3న భద్రాచలంలో ప్రారంభమైన
రాష్ట్రస్థాయి మహాసభల్లో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బృందా కారాట్
ప్రసంగిస్తూ ఆర్ఎస్ఎస్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
పోరాడకుండా లొంగిపోయిందని, ఆదివాసీలు ఆ రోజుల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా
పోరాడి ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. మోడీ దృష్టిలో భారత్ అంటే
అంబానీ, అదానీ మాత్రమే గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్లో
గిరిజనులపై దాడులు చేస్తున్నారని, నచ్చిన మతం స్వీకరించిన వారిని ఎస్టీ జాబితా
నుంచి తొలగిస్తున్నారని విరుచుకుపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
వీరభద్రం మాట్లాడుతూ పొత్తులు పొత్తులే.. పోరాటం పోరాటమే అన్నారు. అణగారిన
వర్గాల తరఫున ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. భారాస ఇచ్చిన హామీలను
నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సభలో టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి
భీమ్రావు, నేతలు కారం పుల్లయ్య, బండారు రవికుమార్, ఏజే రమేశ్, బ్రహ్మచారి
తదితరులు పాల్గొన్నారు.