ధ్వజమెత్తిన ప్రధాని నరేంద్ర మోడీ
బళ్లారి : దేశంలో కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఒకటో స్థానంలో
నిలబెట్టేందుకు ప్రజలు మళ్లీ భాజపాను ఆశీర్వదించాలని, అప్పుడే తనకు ఉక్కులాంటి
బలం వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటక విధానసభ ఎన్నికల
ప్రచారంలో భాగంగా బళ్లారిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ
నిప్పులు చెరిగారు. సభ ప్రారంభానికి ముందు హనుమాన్ చాలీసా పఠించారు. జై
బజరంగదళ్..భారత్ మాతాకీ జై అంటూ కన్నడంలో ప్రధాని తన ప్రసంగాన్ని
మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయాలను అవినీతిమయం చేసి భ్రష్టు
పట్టించిందన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోనూ ఆ పార్టీ అదే దారిలో ముందుకు
వెళ్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల ప్రణాళిక
దేశంలోనే కర్ణాటకను అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకెళ్లేలా ఉంటే
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ప్రజలను మోసం చేసేలా ఉందని ఆయన దుయ్యబట్టారు.
కర్ణాటకను ఒకటో స్థానంలోకి తీసుకెళ్లడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు బీజేపీ
ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు కడుపు
మంట వస్తోందన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా
పోతుందన్నారు. ఆదివాసీలు..వారి సంస్కృతులపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు..
ఆదివాసీ మహిళను మేం రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని మోడీ
ధ్వజమెత్తారు. ‘కేరళ స్టోరీ’ చిత్రాన్ని సమర్థిస్తూ ఆయన మాట్లాడారు.
తీవ్రవాదం నేపథ్యంతో ఆ చిత్రాన్ని రూపొందించారని, కాంగ్రెస్ పార్టీ అలాంటి
తీవ్రవాదులకు వంతపాడటం విచారకరమని అన్నారు. లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప,
మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థులు
టి.హెచ్.సురేశ్‌బాబు, శిల్పా పాటిల్, సోమలింగప్ప పాల్గొన్నారు.