శాంతినగరలో విధానసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు
గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళుతున్నారు.
కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్.ఏ.హ్యారిస్, బీజేపీ అభ్యర్థిగా
ఈసారి కే. శివకుమార్ పోటీ చేయగా, జేడీఎస్ నుంచి మంజునాథ గౌడ పోటీలో ఉన్నారు.
వారితో పాటుగా ఆప్, ఆర్పీఐ, బీఎస్పీ, ఎస్డీపీఐ పార్టీల అభ్యర్థులు బరిలో
ఉన్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ : ప్రధానంగా కాంగ్రెస్–బీజేపీ మధ్య పోటీ తీవ్ర
పోటీ నెలకొంది. ఐటీ సిటీలో ప్రధాన ఆకర్షణీయమైన ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు,
అతి సుందరంగా తీర్చుదిద్దుకున్న చర్చీస్ట్రీట్ లాంటి పలు ప్రధాన మార్గాలు
శాంతినగర నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. పాశ్చాత్య శైలి దుస్తులు, తిండి
పదార్థాలు, పబ్, క్లబ్‌లు అధిక సంఖ్యలో ఇక్కడనే ఉన్నాయి. కన్నడేతరులు అధికంగా
ఉన్న కాలనీలు సైతం శాంతినగర నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మూడుసార్లు
ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్.ఏ.హ్యారిస్ అభివృద్ధి పనులు చేపడుతూ అన్ని
వర్గాల ప్రజలను ఆకట్టుకొంటూ ముందుకు వెళుతున్నారు.
తొలిసారిగా శివాజీనగర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బీజేపీ అభ్యర్థి
కట్టా సుబ్రమణ్యనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నియోజకవర్గ
పునర్విభజనతో తన నివాసం శాంతినగర నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో 2008, 2013,
2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసేందుకు బీజేపీ ఈసారి మాజీ కార్పొరేటర్
శివకుమార్‌ను బరిలోకి దింపింది. ఈసారి శాంతినగర కోటపై కాషాయం జెండాను
ఎగురవేసేందుకు బీజేపీ శివకుమార్ తీవ్ర స్థాయిలో ప్రచారం చేపడుతున్నారు.
ఎంపీ పీసీ మోహన్ ఆయనతో పాటు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మురికివాడలు, దిగువ
మధ్యతరగతి వర్గాలు అధికంగా నివసించే శాంతినగర నియోజకవర్గంలో ముస్లింలు,
తమిళులు, మళయాళీలు, తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మురికివాడల్లో తమ ఓటు
బ్యాంకును భద్రం చేసుకునే ప్రయత్నాల్లో ప్రధాన రాజకీయ పా ర్టీల అభ్యర్థులు
ఉన్నారు. నియోజకవర్గంలో 2,16,394 మంది ఓటర్లు ఉండగా అందులో 1,09,920 మంది
ఓటర్లు పురుషులు, 1,06,427 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటర్లు ఉన్నారు.