వసంత్ విహార్ లో బీఆర్ఎస్ భవన్ నిర్మాణం
సుదర్శన హోమం, వాస్తు పూజలలో పాల్గొన్న కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని వసంత్ విహార్ లో నూతనంగా నిర్మించిన భారత్ రాష్ట్ర
సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయ భవనాన్ని పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా అనుకున్న ముహుర్తం 1.05
గంటలకు పార్టీ ఆఫీసును రిబ్బన్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు.
ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో
పాల్గొన్నారు. భవన్లో దుర్గామాత అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు
చేశారు. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ కు వెళ్లి తన సీటులో
కేసీఆర్ ఆసీనులయ్యారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ నేతలు
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్,
ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత,
సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు. 2021 సెప్టెంబర్ 2న పార్టీ ఆఫీసు నిర్మాణానికి
కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 4 అంతస్థులు, 20 గదులతో 11 వేల చదరపు అడుగుల
స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్
క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4
ప్రధాన కార్యదర్శుల చాంబర్లు, మొదటి అంతస్థులో కేసీఆర్ చాంబర్,
కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి.