లింగాయతలందరూ మాతోనే
భూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప
బెంగళూరు : భూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే
బీఎస్‌వై.. అప్ప.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగినా నేటికీ రాష్ట్ర
బీజేపీకి ఆయనే కీలకం. దక్షిణ భారత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా కర్ణాటకలో
బీజేపీ వేర్లు విస్తరించటంలో యడియూరప్ప సేవలు అనితర సాధ్యం. 40 ఏళ్ల తర్వాత
తొలిసారిగా యడియూరప్ప లేకుండా బీజేపీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రత్యక్షంగా
పోటీ చేయకపోయినా పార్టీ ఎన్నికల వ్యూహానికి కర్త, కర్మ, క్రియ యడియూరప్పనే.
ఈసారి ఎన్నికల్లో బీజేపీకి విజయం చేకూర్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్న
యడియూరప్పతో జరిపిన ముఖాముఖి.
ప్రశ్న : మీ నేతల్లో ఎవరిని కదిలించినా 150 స్థానాల్లో గెలుస్తామని
ప్రకటిస్తున్నారు. మీలో ఎందుకంత నమ్మకం?
జవాబు : కేంద్ర, రాష్ట్రాల్లో స్థిరమైన పాలన అందించగలిగేది భాజపా మాత్రమే.
కేంద్రంలో తొమ్మిదేళ్లుగా, రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా మంచి పాలన అందించాం.
కరోనా, వరదలు, ఆర్థిక సమస్యలను చక్కగా ఎదుర్కొన్నాం. భాజపా తప్పక మరే పార్టీ
సుస్థిర పాలన అందించలేదని ప్రజలకు తెలుసు. మా గెలుపు లాంఛనమే
ప్రశ్న : మరి పాలనపై వ్యతిరేకత వినిపిస్తోంది?
జవాబు : ఎవరన్నారో చెప్పండి? ఆ మాట విపక్షాల నుంచే వినిపిస్తోంది. కాంగ్రెస్,
జేడీఎస్ పాలనతో విసిగిన తర్వాతనే భాజపాకు అవకాశం ఇచ్చారు. వారి విశ్వాసాన్ని
వమ్ము చేయలేదు. మరో ఐదేళ్లకు సరిపడా విశ్వాసాన్ని పొందాం.
ప్రశ్న : ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారా? తీసుకున్నారా?
జవాబు : సంకీర్ణ ప్రభుత్వ విధానాలు, ఆయా పార్టీల తీరుపై అసంతృప్తి చెందిన
ఎమ్మెల్యేలు మాకు మద్దతిచ్చారు. వారంతట వారు దగ్గరకు వస్తే మేమెందుకు
కాదనుకుంటాం. ఓ రాజకీయ పార్టీగా ఆ అవకాశాన్ని వినియోగించుకున్నామంతే.
ప్రశ్న : అలా వచ్చిన వారివల్లనే పార్టీ విధేయుల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు
ఉంది కదా?
జవాబు : ఓసారి పార్టీ విధానాలు నచ్చి చేరిన తర్వాత అందరూ ఒకటే. మాలో ఎలాంటి
భిన్నాభిప్రాయాలు లేవు. అలాంటిదే ఉంటే వారందరికీ మరోమారు ఎందుకు టికెట్
ఇస్తాం? మా పార్టీని నమ్మి వచ్చినవారికి పార్టీ ఎప్పటికీ ద్రోహం చేయదు.
ప్రశ్న : మిమ్మల్ని ఉన్నపళంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారెందుకు?
జవాబు : పార్టీ నాకు ఊహించినదాని కంటే ఎక్కువే ఇచ్చింది. నాలుగుసార్లు నన్ను
ముఖ్యమంత్రిని చేసింది. పార్టీ నిబంధనలను కూడా సడలించి 75 ఏళ్లు దాటినా నాకు
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడూ పార్లమెంటరీ బోర్డు
సభ్యులుగా నియమించింది. పార్టీ నన్ను ఎప్పుడూ గౌరవంగానే చూసుకుంది. ప్రధాని
మోదీ, కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలకు రుణపడి ఉన్నాను.
ప్రశ్న : ప్రస్తుతం సీనియర్లందరినీ పక్కనబెట్టేందుకు చూస్తున్నట్లున్నారా?
జవాబు : సీనియర్లను పక్కనబెట్టాలన్నది పార్టీ ఉద్దేశం కాదు. కొత్త నాయకత్వం,
యువతకు చోటివ్వాలని పార్టీ భావించింది. అందులో భాగంగా సీనియర్లకు ఈసారి
టికెట్ ఇవ్వలేదు. సీనియర్లే కాదు సిట్టింగ్‌లకు కూడా కొందరికి ఇవ్వలేదు.
ప్రశ్న : దాదాపు మీతో సరిసమానంగా పార్టీకి సేవలందించిన జగదీశ్ శెట్టర్‌ను
ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
జవాబు : ఎవరన్నారు జగదీశ్ శెట్టర్‌ను పార్టీ నిర్లక్ష్యం చేసిందని? ఆయనను
రాజ్యసభకు పంపి మంత్రిని కూడా చేస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి టికెట్
ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఓ చిన్న అవకాశం కోసం పార్టీని మారిన శెట్టర్
నిజంగా ద్రోహం చేశారు. ఆయన వల్లనే పార్టీ బలపడినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
పార్టీ.. తర్వాతనే అందరూ.
ప్రశ్న : మీరు కూడా గతంలో భాజపాకు పోటీగా కొత్తపార్టీ పెట్టారు కదా?
జవాబు : అందుకు నేనెప్పుడూ చింతిస్తుంటాను.
ప్రశ్న : లింగాయత నేతలకు పార్టీలో గౌరవం లేదంటున్నారు.. నిజమేనా?
జవాబు : ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన లింగాయత ఓట్లు భాజపాకు
రావంటే ఎలా? ఇప్పటికీ, ఎప్పటికీ లింగాయతుల్లో 85 శాతం ఓట్లు భాజపాకే పడతాయి.
వారే కాదు.. రాష్ట్రంలో అన్ని సముదాయాలను భాజపా సమానంగా చూస్తోంది. ఎస్సీ,
ఎస్టీ, ఒక్కలిగ, ఓబీసీ సముదాయాల కోసం రిజర్వేషన్ ప్రమాణం పెంచింది భాజపా
మాత్రమే. ముస్లింలకు కూడా న్యాయమే చేశాం.
ప్రశ్న : పార్లమెంటరీ మండలి, ఎన్నికల సమితిలో సభ్యులు కాబట్టే మీ కుమారుడికి
టికెట్ ఇప్పించగలిగారా?
జవాబు : విజయేంద్రకు టికెట్ ఇచ్చింది నా సిఫార్సుతో కాదు. అతని బలం, పార్టీకి
చేసిన సేవల వల్లనే టికెట్ ఇచ్చారు. ఇలాంటి యువకుల కోసం పార్టీ ఎదురుచూస్తోంది.
ప్రశ్న : మీ వారసుడిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన బొమ్మై నాయకత్వం ఎలా ఉంది?
జవాబు : బొమ్మై పాలన భేషుగ్గా ఉంది. ఏడాదిన్నర కాలం ఆయన బాగా పని చేసినట్లు
అధిష్ఠానమే గుర్తించిది కదా..
ప్రశ్న : మళ్లీ అధికారంలోనికి వస్తే బొమ్మై ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా?
జవాబు : అధిష్ఠానం సూచనతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తాం.