బెంగళూరు : మరోసారి రాజధాని నగరంలో రోడ్‌షో నిర్వహించేందుకు ప్రధానమంత్రి
నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. గత శనివారం (ఏప్రిల్ 29) మాగడి రోడ్డులో
రోడ్‌షోను నిర్వహించిన ప్రధాని వచ్చే శనివారం ఉద్యాననగరిలో శక్తి ప్రదర్శన
నిర్వహించనున్నారు. ఉదయం బెంగళూరు కేంద్రం, తూర్పు విభాగాలలో 8 కిలోమీటర్లు,
సాయంత్రం నగరంలోని ఇతర నియోజకవర్గాలలో 28 కిలోమీటర్లు పర్యటిస్తారని బీజేపీ
కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం కేఆర్‌పురం, సీవీరామన్ నగర, బ్రిగేడ్
రోడ్డు పరిధిలో, సాయంత్రం కోణనకుంటె, జయనగర, గాంధీబజార్, శాంతినగర,
బిన్నిమిల్లు, మాగడి రోడ్డు, టోల్‌గేటు, దాసరహళ్లి, హౌసింగ్ బోర్డు,
బసవేశ్వరనగర, నవరంగ్, మల్లేశ్వరం, సంపిగె రోడ్డు, సర్కిల్ మారమ్మ ఆలయం తదితర
మార్గాలలో 23 నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటన కొనసాగనుంది. ‘నమ్మ కర్ణాటక
యాత్ర’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాతీయ యువ మోర్చా అధ్యక్షుడు
తేజస్వి సూర్య తెలిపారు. ఈ రోడ్డు షోలలో పది లక్షల మంది పాల్గొంటారని
వివరించారు.