వివాహ చట్టబద్ధత అంశంలోకి వెళ్లం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్క జంటల సమస్యలను పరిష్కరించే విషయంలో కేంద్ర
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇబ్బందుల్లో సమంజసమైన వాటికి
పాలనాపరమైన పరిష్కారాలను అన్వేషించేందుకు కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఓ
కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపింది. అయితే,
పిటిషనర్లు లేవనెత్తిన మౌలిక సమస్య ‘స్వలింగ జంటల వివాహ బంధానికి చట్టబద్ధత
కల్పించే అంశం’లోకి కమిటీ వెళ్లబోదని స్పష్టం చేసింది. స్వలింగ జంటల
పెళ్లిళ్లకు గుర్తింపునివ్వక పోతే ఆ దంపతులు సంయుక్తంగా బ్యాంక్ ఖాతా
ప్రారంభించడం, భవిష్య నిధి సంస్థ వద్ద జీవిత భాగస్వామి పేరును నామినీగా నమోదు
చేయడం, గ్రాట్యూటీ, పింఛను, ఇన్సూరెన్స్ వంటివి పొందడం సాధ్యమేనా అని
ఏప్రిల్ 27న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్
నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్
ఎస్.ఆర్.భట్, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ పి.ఎస్.నరసింహ సభ్యులుగా ఉన్న
ఈ ధర్మాసనం లేవనెత్తిన అంశాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆయా సమస్యలకు
పరిపాలనాపరమైన పరిష్కారాలను కనుగొనటానికి కమిటీని నియమించేందుకు సిద్ధమైంది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని
ధర్మాసనానికి తెలిపారు. సమస్యల పరిష్కారానికి చేయాల్సిందేమిటో స్వలింగ దంపతులు
కూడా తమ సలహాలు, సూచనలు కమిటీకి ఇవ్వొచ్చని మెహతా వివరించారు.
సంయుక్త భేటీలో చర్చించండి: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
స్వలింగ జంటల వివాహానికి చట్టబద్ధత అంశంపై ఏడో రోజు కొనసాగిన విచారణ సందర్భంగా
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఇరు పక్షాలకు ఒక సూచన చేశారు. కేంద్ర
ప్రభుత్వం కమిటీని నియమించేందుకు అంగీకరించినందున పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు
న్యాయవాదులు సమావేశమై పరిష్కారాలపై చర్చించాలన్నారు. ఈ ప్రతిపాదనను సొలిసిటర్
జనరల్ మెహతా స్వాగతించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఎ.ఎం.సింఘ్వి
కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ జోక్యం
చేసుకుంటూ స్వలింగ జంటలకు కలిసి జీవించే హక్కు ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా
కూడా అంగీకరించారని స్పష్టమవుతుందన్నారు. సమాజమూ సమ్మతి తెలుపుతుందన్న భావన
వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆ జంటలకు సంయుక్త బ్యాంకు ఖాతాలు
ప్రారంభించడం, బీమా పాలసీలు పొందడం వంటి వాటికి ప్రభుత్వం మార్గం సుగమం చేయడం
ఓ ముందడుగేనని అభిప్రాయపడ్డారు. అయితే, ఇవన్నీ ఆ దంపతుల వివాహ బంధాన్ని
గుర్తించినప్పుడే సాధ్యమవుతుందని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పగా
అదంతా మనం ఏర్పరుచుకున్న నిబంధనల వల్లేనని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
అనంతరం వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు యువ స్వలింగ జంటల్లో
అత్యధికులు తమ వివాహానికి చట్టబద్ధతను కోరుకుంటున్నారని తెలిపారు. దీనికి
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ అత్యధికుల, అల్పసంఖ్యాక వర్గాల
అభిప్రాయాలు ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న కాదని, రాజ్యాంగం ఏంచెబుతుందన్నదే
ప్రధానమని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారమే తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం
చేశారు. తదుపరి వాదనలు ఈ నెల 9న జరగనున్నాయి. స్వలింగ వివాహాలను గుర్తించే
విషయంలో తొందరపడవద్దని, ఆ విషయాన్ని పార్లమెంటుకు వదిలిపెట్టాలంటూ
మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.