న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కలిశారు. దేశంలో
మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో మరిన్ని
పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ కంపెనీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా
వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు టిమ్ కుక్.
విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం సహా భారత్‌లో జరుగుతున్న సాంకేతిక
పరివర్తనలను ప్రస్తావించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భారత్‌లో విద్య,
పర్యావరణం, టెక్నాలజీ సహా ఇతర రంగాలు మరింత వృద్ధి చెందడంలో సహాయ పడేందుకు
అలాగే దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టిమ్
కుక్ తెలిపారు. టిమ్ కుక్ చివరిసారిగా 2016లో భారత్‌ను సందర్శించారు. మళ్లీ
దాదాపు 7 సంవత్సరాల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌లో యాపిల్ అడుగు
పెట్టి 25 వసంతాలు గడిచిన సందర్భంగా దేశంలో మొట్టమొదటి యాపిల్ రిటైల్ స్టోర్‌ను
ముంబయిలో ప్రారంభించారు. ఇక గురువారం రెండో యాపిల్ అవుట్‌లెట్‌ను ఢిల్లీలో
ప్రారంభించనున్నారు కుక్. ఈ పర్యటనల నేపథ్యంలో ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర
మోడీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
దేశంలో తొలి యాపిల్ స్టోర్
దేశంలో తమ తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను ముంబయిలో ప్రారంభించింది యాపిల్. ఈ
స్టోర్‌ను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 18న గ్రాండ్‌గా ఓపెన్ చేశారు.
ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది యాపిల్.
ఈ కార్యక్రమంలో స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ దగ్గరుండి కస్టమర్లకు స్వాగతం
పలికారు.
దేశంలో యాపిల్ అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రిటైల్
స్టోర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు.
మొత్తంగా యాపిల్ సంస్థకు దేశంలో 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ
సంఖ్యను భవిష్యత్తులో 10 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమని సంస్థ నిర్వాహకులు
చెబుతున్నారు. ఈ స్టోర్లను ప్రపంచంలో ఉన్న యాపిల్ షోరూంల మాదిరిగానే
రూపొందించినప్పటికీ స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక
ఏర్పాట్లు చేశారు. ఈ స్టోర్‌లోని ఒక్కో ఫ్లోర్లో సుమారు 100 మంది సిబ్బంది
ఉంటారు. వీరు ఏకంగా 18 భాషల్లో కస్టమర్లతో మాట్లాడగలరు.భారతదేశంలో 2020లో తన
ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన యాపిల్.. రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని గత
కొంతకాలంగా భావిస్తున్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఎట్టకేలకు ముంబయిలో
తమ మొదటి రిటైల్ స్టోర్‌ను తెరిచింది యాపిల్. అలాగే ఢిల్లీలో రెండో యాపిల్
స్టోర్‌ను గురువారం టిమ్ కుక్ ప్రారంభిస్తారు.