న్యూఢిల్లీ : మీరు మీ పనిమీదే దృష్టి పెట్టండని సిబిఐ అధికారులను ప్రధాన
మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన సిబిఐ డైమండ్
జూబ్లీ వేడుకలను ప్రధాన మంత్రి ప్రారంభించారు. షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లో
కొత్తగా ఏర్పాటుచేసిన సిబిఐ కాంప్లెక్సులను ప్రధాని ప్రారంభించారు. ఈ
కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌తోపాటు ఉత్తమ దర్యాప్తు
అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే డైమండ్ జూబ్లీ ఉత్సవాల
స్మారకార్థం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే సిబిఐ
కొత్త ట్విట్టర్ హ్యాండిల్‌ను మోడీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అవినీతిపరులైన ఏ
ఒక్కరినీ వదలకూడదన్నారు. అవినీతి రహిత దేశాన్ని రూపొందించడమే సిబిఐ ప్రధాన
బాధ్యత అని అన్నారు. ‘సిబిఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సిబిఐ ఆఫీసులు
నెలకొల్పుతున్నాం. 2014 తరువాత సిబిఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపరులు
భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఆర్థిక
నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బిజెపి ప్రభుత్వం
అవినీతిపై యుద్ధం చేస్తోందని అన్నారు.