అన్ని పార్టీల గురి ఆ సామాజిక వర్గం ఓట్లపైనే
కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర
ఎన్నిక ఏదైనా ‘శాసించేది వారే!’
బెంగుళూరు : కర్ణాటక చరిత్రలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన సామాజిక
వర్గమది. 9 శతాబ్దాల క్రితమే సమాజంలో నెలకొన్న వివక్షకు, కరడుగట్టిన
సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగు వర్గాలకు అండగా నిలిచింది. బసవన్న
ఆదర్శాలతో సకల వర్గాల ఆదరణను చూరగొంది. లింగాయత్ లేదా వీరశైవ లింగాయత్‌లుగా
పేరొందిన ఈ సామాజిక వర్గం ఆధునిక రాజకీయాల్లోనూ తనదైన విశిష్టతను
నిలుపుకుంటోంది. రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్‌లు అసెంబ్లీ
ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తారు. మొత్తం 224 శాసనసభ నియోజక
వర్గాలకు గాను వంద స్థానాల్లో వీరి ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో 17 శాతం
మంది లింగాయత్‌లు కాగా వక్కళిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18
శాతం, ముస్లింలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. అయితే, 2013 నుంచి
2018 వరకు రాష్ట్రంలో నిర్వహించిన కులాల వారీ జనాభా లెక్కల ప్రకారం
లింగాయత్‌లు 9 శాతం, వక్కళిగలు 8 శాతానికి పరిమితమైనట్లు సమాచారం. ఈ నివేదిక
ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుత అసెంబ్లీలో 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలుంటే
వీరిలో 37 మంది భాజపాకు చెందినవారే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు లింగాయత్
మఠాలు కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తాయి. లింగాయత్‌లలో ఉండే ఉప కులాలదీ ముఖ్య
భూమికే. విద్య, ఉద్యోగాల్లో అధిక వాటా కోరుతూ ఆందోళనకు దిగడంతో సర్కారు
రాష్ట్ర ఓబీసీ జాబితాలో లింగాయత్‌లకు ఉన్న రిజర్వేషన్‌ను మరో 2 శాతం పెంచాలని
నిర్ణయించింది.
ఆ తప్పిదం.. హస్తం పాలిట శాపం : వాస్తవానికి 1989 వరకు లింగాయత్‌లు
కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండేవారు. లింగాయత్ వర్గానికి చెందిన
వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224
స్థానాలకు 178 చోట్ల విజయఢంకా మోగించింది. అయితే, 1990లో పాటిల్
అనారోగ్యానికి గురై కోలుకుంటున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్
గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నేత బంగారప్పను సీఎంగా నియమించారు.
కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఈ పరిణామం
కాంగ్రెస్‌కు లింగాయత్‌లను దూరం చేసింది. ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలకు పరిమితమైంది. ఈ సామాజిక వర్గానికి చెందిన
యడియూరప్ప బీజేపీ అగ్రనేతగా ఎదిగారు.
సొంత పార్టీతో యడియూరప్ప తడాఖా : బీజేపీ , జేడీఎస్ మధ్య కుదిరిన అధికార
పంపిణీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కుమార స్వామి 2007లో సీఎం పదవిని యడియూరప్పకు
అప్పగించేందుకు నిరాకరించడంతో అప్పటి ప్రభుత్వం కుప్పకూలింది. 2008 అసెంబ్లీ
ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలో 110 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ కర్ణాటకలో
తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం 40
స్థానాలకే పరిమితమైంది. అందుకు కారణం బీజేపీ నుంచి యడియూరప్ప దూరం కావడం. ఆయన
కర్ణాటక జనతా పక్ష పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి ఆ ఎన్నికల్లో 6
స్థానాల్లో మాత్రమే గెలిచారు. అయినప్పటికీ 10 శాతం ఓట్లు సాధించి బీజేపీ
ఓటమికి కారణమయ్యారు.
సారథిని మార్చినా సామాజిక వర్గం అదే : 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యడియూరప్ప
తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో
నెగ్గింది. మరోసారి యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 75 ఏళ్లు దాటిన
వారు కీలక పదవుల్లో ఉండరాదనే పార్టీ విధానం కారణంగా 2021లో సీఎం పదవి నుంచి
ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్
బొమ్మైని బీజేపీ సీఎంను చేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ
చేయబోనని యడియూరప్ప ప్రకటించినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆయన్నే ప్రధాన
సారథిగా బీజేపీ ముందుంచింది.
*కాంగ్రెస్ ఆకర్షణ యత్నాలు : గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను
తిరిగి ఆకట్టుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. లింగాయత్ ఎమ్మెల్యే
ఎం.బి.పాటిల్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్
నియమించింది. మరో లింగాయత్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రేను కర్ణాటక కాంగ్రెస్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. మేలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో
లింగాయత్‌లను ప్రసన్నం చేసుకునేందుకు అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్
పోటీపడుతున్నాయి.
లింగాయత్‌ల చారిత్రక నేపథ్యమిదీ : లింగాయత్ మత ఆవిర్భావం 12వ శతాబ్దంలో
జరిగింది. వ్యవస్థాపకుడు బసవ. ఆయన వేదాలను, వాటికి సంబంధించిన విశ్వాసాలను
తిరస్కరించారు. లింగాయత్‌లు ఆలయాలను సందర్శించరు. బహుదేవతారాధనకు వ్యతిరేకులు.
కుల వ్యవస్థను నిరసిస్తారు. వీరి దృష్టిలో స్త్రీ, పురుషులు సమానులే. భర్త
చనిపోయిన మహిళ పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. బాల్య
వివాహాలు నిషేధం. లింగాయత్‌లు భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా
పాల్గొన్నారు. 1956 నుంచి 1969 వరకు కర్ణాటకలో ముఖ్యమంత్రులైన వారిలో నలుగురు
ఎస్.నిజలింగప్ప, బి.డి.జట్టి, ఎస్.ఆర్.కాంతి, వీరేంద్ర పాటిల్..
లింగాయత్‌లే. 1969 తర్వాత కాంగ్రెస్ చీలికల ప్రభావం లింగాయత్లపైనా పడింది.
1983-89 మధ్యకాలంలో లింగాయత్‌లు జనతా పార్టీలో ప్రాబల్యం వహించారు.
ముఖ్యమంత్రులైన ఎస్.ఆర్.బొమ్మై, జె.హెచ్.పటేల్ ఈ సామాజిక వర్గం వారే.
కాల క్రమంలో లింగాయత్‌లు బీజేపీ వైపు మళ్లారు. 2006-07లో బి.ఎస్.యడియూరప్ప
నేతృత్వంలో బీజేపీ కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి అధికారాన్ని పంచుకునే
స్థాయికి ఎదిగింది. ఈ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్ప, జగదీశ్ శెట్టర్,
బి.ఎస్.బొమ్మై ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం భారత దేశంలో
లింగాయత్‌లు 3 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా. వీరిలో కర్ణాటకలో 1.5 కోట్ల
మంది, మహారాష్ట్రలో 1.09 కోట్లు, తెలంగాణలో సుమారు 50 లక్షల మంది
నివసిస్తున్నారు. తమిళనాడు, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్లలలోనూ వీరు గణనీయంగా
ఉన్నారు.