తక్షణం ఆ సమాచారాన్ని వెనక్కు తీసుకోండి
రక్షణ మంత్రిత్వశాఖను ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూ ఢిల్లీ : అర్హులైన మాజీ సైనికులకు వన్ ర్యాంకు-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)
బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న
ఇచ్చిన సమాచారాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోరాదని మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది. ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్
జె.బి. పార్దీవాలాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ జరిపింది. మాజీ
సైనికులకు మార్చి 15 నాటికి ఓఆర్ఓపీ బకాయిలను పూర్తిగా చెల్లించాలని
సుప్రీంకోర్టు జనవరి 9న ఆదేశాలిచ్చింది. ఆ బకాయిలను నాలుగు వార్షిక వాయిదాల్లో
చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న పేర్కొంది. ఈ నిర్ణయాన్ని రద్దు
చేయాలంటూ భారత మాజీ సైనికుల ఉద్యమం (ఐఈఎస్ఎం) తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్
దాఖలైంది. దీనిపై ఫిబ్రవరి 27న విచారణ జరిపిన ధర్మాసనం అర్హులైన పింఛనుదారులకు
చెల్లింపుల్లో జాప్యంపై, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నాలుగు వాయిదాల్లో
చెల్లిస్తామనడంపై మంత్రిత్వ శాఖను సంజాయిషీ కోరింది. సోమవారం మరోసారి ఈ అంశంపై
ధర్మాసనం విచారణ జరిపింది.ఇప్పటికే బకాయిల్లో ఒక కిస్తీని ప్రభుత్వం
పెన్షనర్లకు చెల్లించిందని, మిగతా మొత్తం చెల్లించడానికి గడువు కావాలని రక్షణ
శాఖ తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టుకు నివేదించారు. ధర్మాసనం
స్పందిస్తూ.. ‘నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ ఇచ్చిన సమాచారాన్ని తొలుత
మంత్రిత్వ శాఖ వెనక్కు తీసుకోవాలి. అప్పుడే గడువుకు సంబంధించి మీ విజ్ఞాపనను
పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. ‘జనవరి 20న మంత్రిత్వ శాఖ జారీ చేసిన
సందేశం.. జనవరి 9 నాటి సుప్రీం తీర్పునకు పూర్తిగా విరుద్ధం. మంత్రిత్వ శాఖ
ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది?
చెల్లింపుల్లో ప్రాధాన్య అంశాలు? ఎలాంటి విధివిధానాలను అనుసరించాలనే అంశాలపై ఈ
నెల 20 లోగా నివేదిక ఇవ్వండని ఆదేశించింది.