భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన తూర్పు
లద్దాఖ్‌లోని గల్వాన్ ప్రాంతంలో భారత సైనికులు క్రికెట్, ఐస్ హాకీ ఆడారు. ఈ
ఆటవిడుపు చిత్రాలను ఆర్మీ అధికారికంగా విడుదల చేస్తూ ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం
చేశాం’’ అని పేర్కొంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)పై రెండు దేశాల మధ్య గత
కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
గల్వాన్‌లో ఎక్కడ ఆడారన్నది కచ్చితంగా చెప్పకపోయినప్పటికీ.. పెట్రోలింగ్
పాయింట్ 14కు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆడుతున్న ప్రాంతం
ఉండవచ్చని జాతీయ మీడియా వర్గాల కథనాలు వెల్లడించాయి. త్రిశూల్ డివిజనుకు
చెందిన పాటియాలా బ్రిగేడ్ ఆర్మీ ఈ క్రికెట్ పోటీని నిర్వహించినట్లు సమాచారం.
మరోవైపు ఐస్ హాకీ కూడా ఆడటంతోపాటు సరిహద్దుల్లో గుర్రాలపై సైనికులు పహారా
కొనసాగిస్తున్నారు. 2020 మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య గల్వాన్ ప్రాంతంలో
ఘర్షణ చోటుచేసుకొని.. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
చైనా మాత్రం తమ వైపు నుంచి మృతులు, క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు.
ప్రస్తుతం దిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత విదేశీ
వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగశాఖ మంత్రి చిన్ గ్వాంగ్
ముఖాముఖి సమావేశమైన తర్వాతి రోజునే ఇండియన్ ఆర్మీ ఈ ఫొటోలను పోస్టు చేయడం
గమనార్హం.