బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ
నేడు సాంకేతికతపై వెబినార్
న్యూఢిల్లీ : సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు సుపరిపాలన చేరాలని ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీంతో ఎలాంటి వివక్ష, ఆశ్రితపక్షపాతం, అవినీతికి
తావుండదని అన్నారు. పస్మాందా ముస్లింలలో వెనుకబాటుతనాన్ని ప్రస్తావించిన ఆయన
తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో సమాజంలోని అణగారిన వర్గాలను చేరేందుకు
చేస్తున్న కృషిని వివరించారు. ‘చిట్టచివరి మైలును చేరడం’ అనే అంశంపై
నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ప్రభుత్వం వరుసగా 12 వెబినార్లను నిర్వహిస్తుండగా ఈ క్రమంలో ఇది నాలుగోది.
బడ్జెట్ (2023)లో ప్రకటించినవి సమర్థంగా అమలయ్యేందుకు సలహాలు, ఆలోచనలను
స్వీకరిస్తూ వీటిని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ
గిరిజనుల్లో అత్యంత వెనుకబడి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని
ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘‘దేశంలోని 200 జిల్లాల్లో 22 వేలకు పైగా
గ్రామాల్లో గిరిజనుల కోసం సత్వరం మనం అనేక సౌకర్యాలను కల్పించాలి.
మైనారిటీల్లోనూ, ప్రత్యేకించి ముస్లింలలో పస్మాందా ముస్లింలు స్వాతంత్య్రం
వచ్చి చాలా ఏళ్లవుతున్నా నేటికీ వారంతా వెనుకబడి ఉన్నారు. వారికి ప్రయోజనాలను
చేకూర్చాలి’’ అని అన్నారు. అభివృద్ధికి డబ్బుతో పాటు రాజకీయ సంకల్పం
అవసరమన్నారు.
గిరిజన తెగల అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు.
‘‘సుపరిపాలనకు మనం ఎంత ప్రాధాన్యం ఇస్తే చిట్టచివరి వరకు చేరుకోవాలన్న మన
లక్ష్యం అంత సులభతరం అవుతుంది’’ అని అన్నారు. గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల్లో
చిట్టచివరి వ్యక్తి వరకు సుపరిపాలన చేరే విషయమై తాజా కేంద్ర బడ్జెట్లో
ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా
సద్వినియోగం అయ్యేందుకు బడ్జెట్ అనంతర మేధోమథనం ఎంతో కీలకమని అన్నారు. ఈ
సందర్భంగా వ్యాక్సినేషన్, ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు, ‘అమృత్ సరోవర్’ల
నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన జల్జీవన్
మిషన్ తదితర అంశాలను ప్రధాని వివరించారు. ఈ ఏడాది బడ్జెట్లో పేదలకు ఇళ్ల
కోసం రూ.80 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సికెల్ సెల్ వ్యాధిని
పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బడ్జెట్లో లక్ష్యం నిర్దేశించినట్లు వివరించారు.
నేడు సాంకేతికతపై వెబినార్ : సులభతర జీవనానికి సాంకేతికత (టెక్నాలజీ) అనే
అంశంపై మంగళవారం నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ
ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ
కార్యక్రమంలో ప్రసంగిస్తారని ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. డిజిలాకర్,
నేషనల్ డేటా గవర్నెన్స్, చిరునామా అప్డేట్ సౌకర్యం, ఫిన్టెక్ సేవలు, ఏఐ
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మిషన్ కర్మయోగి, ఈ-కోర్టులు, 5జీ, సులభతర వాణిజ్యం
తదితర అంశాలను ఈ వెబినార్లో చర్చించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.