పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి జైరాం రమేశ్
సభ్యుల నియామక అధికారం అధ్యక్షుడికి అప్పగింత
స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం
రాయ్‌పుర్ : కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీకి ఎన్నిక
నిర్వహించకుండా సభ్యులను నామినేట్ చేయాలని పార్టీ స్టీరింగ్ కమిటీ
ఏకగ్రీవంగా తీర్మానించింది. సభ్యుల నియామక అధికారాన్ని అధ్యక్షుడికి
అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో ప్రారంభమైన 85వ పార్టీ
ప్లీనరీలో ఇందుకు ఆమోద ముద్ర వేసింది. స్టీరింగ్ కమిటీలో ఉన్న 45 మంది
సభ్యులూ ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు పార్టీ ప్రధాన
కార్యదర్శి, మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి జైరాం రమేశ్ విలేకర్ల సమావేశంలో
వెల్లడించారు. దీనికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా మద్దతు పలుకుతారని పూర్తి
విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు.
పార్టీ రాజ్యాంగానికి సవరణలు : కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానులు, మాజీ
అధ్యక్షులకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం కల్పించేలా పార్టీ రాజ్యాంగ
నిబంధనలకు సవరణ ప్రతిపాదించారు. దీనివల్ల మన్మోహన్సింగ్, సోనియాగాంధీ,
రాహుల్‌గాంధీలకు సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం దక్కనుంది. వర్కింగ్ కమిటీతో
పాటు పార్టీకి చెందిన వివిధ స్థాయిల కమిటీల్లో 50శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ,
ఓబీసీ, మహిళ, మైనార్టీ, యువతకు కేటాయించేలా మరో సవరణ చేయనున్నారు. దానివల్ల
కమిటీలోని 23 స్థానాల్లో (పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు
ప్రెసిడెంట్, మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షులు, పార్లమెంటు ఉభయసభల్లో పార్టీ
నేతలు మినహాయించి) 50% ఈ వర్గాలకు దక్కనున్నాయి. ప్రస్తుత ప్లీనరీలోనే పార్టీ
రాజ్యాంగంలోని మొత్తం 16 అధికరణలు, 32 నిబంధనలకు సవరణలు ప్రతిపాదించినట్లు
జైరాం రమేశ్ విలేకర్లకు వెల్లడించారు. సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకోకుండా,
నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి అప్పగించడాన్ని జైరాం రమేశ్
సమర్థించుకున్నారు. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు,
ఎదురవుతున్న సవాళ్లు, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోషించాల్సిన పాత్రను
దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. నామినేషన్ విధానం వల్ల బడుగు,
బలహీన వర్గాలు, యువత, గిరిజనులు, ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి
వీలవుతుంది. ఈ అంశంపై తొలి రోజు దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించాం. 45 మంది
సభ్యులూ ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడారు. అన్ని కోణాలపైనా కూలంకషంగా
చర్చించిన తర్వాతే అంతిమంగా సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని అధ్యక్షుడికి
అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారని వెల్లడించారు. అంతకుముందు స్టీరింగ్
కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికపై స్వేచ్ఛగా చర్చించి, కలిసికట్టుగా
నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
స్టీరింగ్ కమిటీ భేటీకి సోనియా, రాహుల్ దూరం : కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో
భాగంగా తొలిరోజు నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో సోనియా, రాహుల్,
ప్రియాంకాగాంధీలు పాల్గొనలేదు. మిగతా సభ్యులు స్వేచ్ఛగా చర్చించి తగిన నిర్ణయం
తీసుకొనేందుకు వీలుగా వారు ఈ సమావేశంలో పాల్గొనలేదని పార్టీ వర్గాలు
పేర్కొన్నాయి. శనివారం జరిగే సమావేశాలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తారు. తర్వాత
రాజకీయ, ఆర్థిక, విదేశీ తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు చివరి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయం,
యువత, విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు.
ఉదయం 10.30 గంటలకు రాహుల్‌గాంధీ ప్లీనరీని ఉద్దేశించి మాట్లాడుతారు. మధ్యాహ్నం
2 గంటలకు పార్టీ అధ్యక్షుడు ముగింపు ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు
బహిరంగ సభ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో పాటు మల్లికార్జున ఖర్గే,
రాహుల్‌గాంధీలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.