మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
అవినీతిలో కూరుకుపోయిన బొమ్మై సర్కారు
40% కమీషన్రాజ్గా ప్రభుత్వంపై ముద్ర
అభివృద్ధిపై ఓట్లడిగే పరిస్థితి లేక మత రాజకీయం
బెంగళూరు: దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో మూడు
నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో
తిరుగుబావుటా ఎగురవేయించి, 2019లో అడ్డదారిలో అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు
పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. ‘40 శాతం కమీషన్ సర్కారు’గా బొమ్మై
ప్రభుత్వానికి ముద్ర పడింది. అభివృద్ధిపై ఓట్లడిగే పరిస్థితి లేకపోవడంతో
కమలదళం హిందూత్వ ఎజెండానే భుజానికెత్తుకుందని, ప్రజల్లో చీలిక తెచ్చి,
ఎన్నికల్లో గట్టెక్కేందుకు వ్యూహం పన్నిందని విశ్లేషకులు చెబుతున్నారు.
హిజాబ్.. హలాల్.. టిప్పు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ మంత్రులు, నేతలు మతం పేరిట ప్రజల్లో
చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హిజాబ్, హలాల్ వివాదాలతో రాష్ట్రం
ఇటీవల అట్టుడింది. తాజాగా టిప్పు సుల్తాన్‌పై బీజేపీ నేతలు వివాదాన్ని
రాజేస్తున్నారు. టిప్పు సుల్తాన్ జయంతిపై నిషేధం, పాఠ్యపుస్తకాల్లో టిప్పు
సుల్తాన్‌ను కీర్తించే పాఠ్యాంశాల తొలగింపు, సలాం ఆర్తిని ఆర్తి నమస్కార్గా
మార్చాలని కోరడం వంటివి చేస్తున్నారు. రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ అనుచరులకు
చోటు లేదని, కేవలం రాముడు, హనుమంతుడి భక్తులకు మాత్రమే చోటు ఉన్నదని రాష్ట్ర
బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామాలయ నిర్మాణం ప్రకటన
హిందూ ఓట్ల ఏకీకరణలో భాగంగా రామ్‌నగర జిల్లాలో రామమందిరం నిర్మిస్తామని
ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో ప్రకటించింది. దక్షిణాది అయోధ్యగా దీన్ని
అభివృద్ధి చేస్తామని తెలిపింది. మరోవైపు, బెంగళూరులోని ఓ ఫ్లై ఓవర్‌కు బీజేపీ
సర్కారు సంఘ్ పరివార్ నేత వీర్ సావర్కర్ పేరు పెట్టింది. అలాగే
రాష్ట్రంలోని పాఠశాల్లో సావర్కర్ ప్రతిమలు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి
సునీల్ కుమార్ తెలిపారు.
పెచ్చుమీరిన అవినీతి
బీజేపీ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయింది. చేసిన పనులకు బిల్లులు
చెల్లించాలంటే 40 శాతం కమీషన్‌ను చెల్లించాలని అధికార పార్టీ నేతలు డిమాండ్
చేస్తున్నారని రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.
ప్రధానికి సైతం లేఖలు రాశారు. ధర్నాలు నిర్వహించారు. అయినా పరిస్థితిలో మార్పు
రాలేదు. కమీషన్ వేధింపులు భరించలేక పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్య
చేసుకున్న ఘటనలు ఉన్నాయి. కారుణ్య మరణం ప్రసాదించాలని కొందరు రాష్ట్రపతికి లేఖ
రాశారు.
ఓటర్లకు తాయిలాలు
ఉచితాలకు వ్యతిరేకమని ప్రగల్భాలు పలికే కమలనాథులు రాష్ట్రంలో మాత్రం ఉచిత
హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటుకు ఆరు వేలు ఇస్తామని ఆ పార్టీ నేత ఇటీవల
బహిరంగంగానే ప్రకటించారు. బడ్జెట్లోనూ ప్రభుత్వం ఉచిత హామీలు గుప్పించింది.
మహిళలు, బాలికలకు ఉచిత బస్సు పాసులు ఇస్తామని ప్రకటించింది. భూమి లేని మహిళా
రైతు కూలీలకు నెలనెలా రూ.500 అందజేస్తామని తెలిపింది.