తేజస్వి
విమర్శించే వారిపై ఈడీ, ఐటీ దాడులు జరిపిస్తారని మండిపాటు
ఎంతో మంది వ్యక్తిత్వాలను చంపేస్తున్నారని ఆగ్రహం
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి
యాదవ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో దేశ రాజకీయ వాతావరణం
పూర్తిగా మారిపోయిందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే
అవినీతిపరులు, కళంకితులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని
విమర్శించే వారిపై ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర దర్యాప్తు
సంస్థలతో దాడులు చేయించడం ద్వారా ఎంతో మంది ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాలను
హననం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి లొంగకపోతే తప్పుడు కేసులు పెట్టి,
జైలుకు పంపుతున్నారని అన్నారు. ఎవరైనా నాయకుడిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా
బీజేపీలో చేరడమో లేక మద్దతుగా ఉండటమో చేస్తే వాళ్లు పునీతులు అయిపోయినట్టేనని
చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీజేపీ కాపాడుతుందని విమర్శించారు.
పాట్నాలో సీపీఐ(ఎం) 11వ జనరల్ కన్వెన్షన్ లో తేజస్వి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు
చేశారు. మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి
పోరాడుదామని కోరారు.