నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పాలనలో దేశం దశాబ్ద కాలాన్ని కోల్పోయిందని భారత
ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన యు పి ఎ
పాలనలో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని ఆరోపించారు. లోక్సభలో ప్రసంగించిన
ప్రధాని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో గత తొమ్మిదేళ్లుగా
జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరు బాధ పడుతున్నారని, నిరాశలో
కూరుకుపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. కోట్లాది మంది ప్రజల
విశ్వాసం తన రక్షణ కవచమన్న ప్రధాని ప్రతిపక్షాల ఆరోపణలు దీన్ని ఛేదించలేవని
అన్నారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం కోట్లాది మంది భారతీయులకు మార్గనిర్దేశం
చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్సభలో మాట్లాడిన ప్రధాని
ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేశారు. ఓ పెద్ద నేత రాష్ట్రపతిని కూడా
అవమానించారన్న మోడీ గిరిజనులపై ఉన్న ద్వేషాన్ని వారు బయటపెట్టారని
మండిపడ్డారు. “దూరదృష్టితో కూడిన ప్రసంగంతో రాష్ట్రపతి మా అందరికీ, దేశంలోని
కోట్లాది మంది ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. గణతంత్ర దేశానికి అధిపతిగా ఆమె
ఉనికి చారిత్రకం. దేశంలోని కుమార్తెలకు, సోదరీమణులకు రాష్ట్రపతి
స్ఫూర్తిదాయకం. రాష్ట్రపతి ఆదివాసుల గౌరవాన్ని పెంచారు. లోక్సభలో మంగళవారం
కొంతమంది వ్యక్తుల ప్రసంగం తర్వాత ఇక్కడి వాతావరణం చూస్తే చాలా మందిలో ఉత్సాహం
తొణికిసలాడింది. రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతున్నప్పుడు కొందరి కళ్లు
కుట్టాయి. ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని కూడా అవమానించారు. గిరిజనులపై ఉన్న
ద్వేషాన్ని వారు ప్రదర్శించారు. ఇలాంటి అంశాలను టీవీల్లో చూసిన తర్వాత వారి
లోపల ఉన్న ద్వేషం బయటపడింది. తర్వాత ఆ నేతలు లేఖ రాసి తమను తాము రక్షించుకునే
ప్రయత్నం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ
అతలాకుతలమవుతున్న వేళ అంతర్జాతీయంగా భారత్ స్థిరమైన సమృద్ధి సాధిస్తోందని
మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం
ఉందని స్పష్టం చేశారు.