లావాదేవీలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన
అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న అదానీ
ఎంటర్ప్రైజెస్
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో) ద్వారా సేకరించిన రూ.20 వేల కోట్ల విషయంలో
అదానీ ఎంటర్ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న
అస్థిరతను దృష్టిలో పెట్టుకుని ఆ నిధులను ఖర్చు చేయకూడదని నిర్ణయం
తీసుకున్నట్టు గత రాత్రి ప్రకటించింది. సేకరించిన నిధులను తిరిగి వెనక్కి
చెల్లించడంతోపాటు లావాదేవీలను ఉపసంహరించుకోనున్నట్టు చెబుతూ తమపై నమ్మకం ఉంచి,
అండగా నిలిచిన ప్రతి పెట్టుబడిదారుడికి కృతజ్ఞతలు తెలిపింది. ఎఫ్పీవో
సబ్స్క్రిప్షన్ విజయవంతమైనప్పటికీ గత వారం రోజులుగా షేర్లలో అస్థిరత
నెలకొందని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అయినప్పటికీ తమ సంస్థపై నమ్మకముంచి
పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. ప్రస్తుత
క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని
ఎఫ్పీవోతో ముందుకు వెళ్లకూడదని బోర్డు నిర్ణయించినట్టు వివరించింది. అయితే, ఈ
నిర్ణయం సంస్థపైనా, కంపెనీ భవిష్యత్ ప్రణాళికపైనా ఎలాంటి ప్రభావం చూపదని
తెలిపింది.