11 నెలలుగా పోరాడుతున్న రష్యాను ఎదుర్కునేందుకు లెపర్డ్-2 యుద్ధట్యాంకు
అవసరమని ఉక్రెయిన్ అడుగుతోంది. ఈ ఆయుధాలను జర్మనీ త్వరలో ఉక్రెయిన్‌కు
అందించనుంది. అయితే ఈ లెపర్డ్-2 అంటే ఏంటి? ఉక్రెయిన్‌కు ఎందుకు అవసరం? వంటి
వివరాలు తెలుసుకుందాం రండి.
లెపర్డ్-2..! : కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా
తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్
గట్టిగా అడుగుతోంది. దీని తయారీదారైన జర్మనీ ఈ ఆయుధాలు త్వరలో ఉక్రెయిన్‌కు
అందిస్తోంది.
ఏమిటీ లెపర్డ్-2?
లెపర్డ్ అంటే చిరుత అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ అధునాతన ప్రధాన యుద్ధ
ట్యాంకు చాలా చురుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే మేటి ఆయుధాల్లో ఒకటిగా గుర్తింపు
పొందింది. జర్మనీకి చెందిన క్రాస్ మఫాయ్ వేగ్మన్ (కేఎండబ్ల్యూ) సంస్థ
దీన్ని అభివృద్ధి చేసింది. లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి
వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2
కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం.
ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్
కంట్రోల్ వ్యవస్థ ఉంది. ఈ ప్రత్యేకతల దృష్ట్యా ఇది అనేక రకాల యుద్ధ
క్షేత్రాలకు అనువుగా ఉంటుంది.ఎన్ని కావాలి?
ప్రస్తుత యుద్ధంపై లెపర్డ్-2 ట్యాంకులు ఏదైనా ప్రభావం చూపాలంటే కనీసం 100
ట్యాంకులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే 300 ట్యాంకులు కావాలని
ఉక్రెయిన్ రక్షణ మంత్రి కోరుతున్నారు.
ఉక్రెయిన్‌కు ఎందుకు అవసరం?
11 నెలల యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా
రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లతో
విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం
చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది.
ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.ఉక్రెయిన్ వద్ద
ప్రస్తుతం 1970ల నాటి టి-72 ట్యాంకులు ఉన్నాయి. వాటిలో సుదూర లక్ష్యాలను
గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ
లేదు. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్మెంట్లో
నిల్వ చేయాలి. శత్రు దాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి సొంత బలగాలకు పెను
నష్టాన్ని కలిగిస్తాయి. లెపర్డ్-2తోపాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ
మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్మెంట్లు ఉన్నాయి.