కార్వార హిందూ హైస్కూల్ వేడుకలకు హాజరు
బెంగళూరు : ప్రతి పాఠ్యాంశంలోనూ రాజ్యాంగ విలువలను మౌలిక సూత్రంగా
పొందుపరచాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
సూచించారు. ఆధునిక విద్యా విధానానికి రాజ్యాంగ విలువలు ఆధారం కావాలని
దిశానిర్దేశం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా కార్వారలో హిందూ హైస్కూల్ 125వ
వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాది నుంచి సీజేఐ వరకూ
నాలుగు దశాబ్దాల వృత్తి జీవితంలో సమానత్వం, సామాజిక న్యాయం మౌలిక సూత్రంగా
ఉండే రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యమిచ్చానని గుర్తు చేసుకున్నారు. విద్యా
సంస్థలు కేవలం పుస్తకాల్లోని అంశాలను బోధించేవిగా కాకుండా సమాజం,
రాజ్యాంగానికి సంబంధించిన విశ్లేషణాత్మక సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ
దిశగా హిందూ హైస్కూల్ దేశ ప్రగతికి దోహదపడేలా వివిధ రంగాల నిపుణులను
అందించిందని చెప్పారు. మాతృభాషలో చదవడం ఎంతో సౌకర్యమని తాను భరోసా ఇస్తానని
జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయ విద్యలో చేరే వరకు తాను తెలుగు మాధ్యమంలోనే
చదివానని వివరించారు.