ఇన్నాళ్లూ భారత్ ప్రయత్నాలకు గండికొడుతూ వచ్చిన చైనా
ఎట్టకేలకు టెక్నికల్ హోల్డ్‌ను ఎత్తేసిన డ్రాగన్ కంట్రీ
జమ్మూకశ్మీర్‌లో దాడులకు మక్కీ ప్రణాళికలు
26/11 ముంబై దాడి సహా పలు ఘటనల్లో మక్కీ హస్తం
పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్య రాజ్య సమితి భద్రతా
మండలి(యూఎన్ఎస్సీ) ఎట్టకేలకు ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. అబ్దుల్‌ను ఈ
జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఇన్నాళ్లూ అడ్డుకుంటూ
వచ్చింది. భద్రతా మండలిలో తనకున్న అధికారాలతో భారత్ ప్రయత్నాలకు
ఎప్పటికప్పుడు గండికొడుతూ వచ్చింది. చైనా తన అధికారాన్ని ఉపయోగించుకుని
అడ్డగోలుగా అడ్డుకోవడంపై గతేడాది జూన్‌లో భారత్ దుమ్మెత్తి పోసింది. ఈ
నేపథ్యంలో చైనా తాజాగా టెక్నికల్ హోల్డ్‌ను ఎత్తేసింది. దీంతో అబ్దుల్
రెహ్మాన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలోకి చేర్చేందుకు యూఎన్ భద్రతా మండలికి
మార్గం సుగమమైంది.
ఇంతకీ ఎవరీ అబ్దుల్ రెహ్మాన్
పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ భారత్‌లో, మరీ ముఖ్యంగా
జమ్మూకశ్మీర్‌లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇందుకోసం లష్కరే తోయిబా,
జమాత్ ఉద్ దవా వంటి ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి నిధులను సేకరిస్తూ వాటిని
ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి, యువతను విధ్వంసం దిశగా నడిపించేందుకు
ఉపయోగిస్తున్నాడు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి సంస్థల్లో మక్కీ నాయకత్వ
స్థానంలో ఉన్నాడు. 22 డిసెంబరు 2000 సంవత్సరంలో ఎర్రకోటపై జరిగిన దాడి, 1
జనవరి 2008లో జరిగిన రాంపూర్ దాడి, 26/11 ముంబై దాడి సహా పలు ఘటనల్లో మక్కీ
హస్తం ఉన్నట్టు యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భద్రతా
సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.