భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఉగ్రదాడులను నిర్మూలించడంలో
విఫలమైనందుకు మాజీ అధ్యక్షుడితోపాటు మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు 31కోట్ల
రూపాయల (శ్రీలంక కరెన్సీ) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. వీటిని ఆనాటి
ఘటనలో బాధితులకు నష్టపరిహారంగా అందజేయాలంటూ తీర్పునిచ్చింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో 2019 ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 270మంది
ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 500 మంది క్షతగాత్రులైనట్లు నివేదికలు
వెల్లడించాయి. అయితే, ప్రార్థన మందిరాలు, హోటళ్లలో జరిగిన ఆ మారణహోమానికి
సంబంధించి శ్రీలంక ప్రభుత్వానికి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తుగానే
హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ వాటిని నిర్మూలించడంలో మైత్రిపాల సిరిసేన
ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత కుటుంబాలు శ్రీలంక
సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన ఏడుగురు సభ్యుల సుప్రీం
ధర్మాసనం అప్పటి దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతోపాటు మరో నలుగురు
ఉన్నతాధికారులకు భారీ జరిమానా విధించింది. నాటి శ్రీలంక అధ్యక్షుడు, రక్షణశాఖ
మంత్రి, త్రివిధ దళాధిపతిగా ఉన్న మైత్రిపాల సిరిసేనకు అత్యధికంగా రూ.2.2కోట్ల
(2లక్షల 73వేల డాలర్లు) జరిమానా విధించింది. వీటిని తన వ్యక్తిగత ఖాతా నుంచి
చెల్లించాలని ఆదేశించింది. ఇక మాజీ పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర, మాజీ
స్టేట్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ అధినేత నీలాంత జయవర్దనేకు 2లక్షల డాలర్ల
చొప్పున చెల్లించాలని తెలిపింది. రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో లక్షా
36వేల డాలర్లు, మాజీ నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ చీఫ్ సిరిరా మెండిస్కు
27వేల డాలర్ల జరిమానా విధించింది.