వ్యాఖ్యలు చేశారు. అటువంటి వాటికి దూరంగా ఉంటానని గతంలో చెప్పిన విషయాన్ని
ప్రస్తావించిన ఆయన కొన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టమేననంటూ ట్వీట్ చేశారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలు వ్యక్తం
చేస్తూ నెట్టింట్లో నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవల ట్విటర్ కొనుగోలు తర్వాత
ఆయన దూకుడును మరింత పెంచారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్ల క్రితం చేసిన ఓ
ట్వీట్‌ను షేర్ చేసిన మస్క్.. కొన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టమేనంటూ
వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటానని 2013లో పెట్టిన ఓ ట్వీట్
గురించి ప్రస్తావిస్తూ ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు. ‘నన్ను చాలా
ఇబ్బంది పెట్టిన రాజకీయ వ్యాఖ్యలు ఇక నుంచి చేయను’ అంటూ 2013 ఏప్రిల్‌లో
ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. కానీ అమెరికా రాజకీయాలపై స్పందిస్తూ తాజాగా
మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పాత ట్వీట్‌ను ప్రస్తావించిన ఆయన కొన్ని
అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.
ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికపై ప్రతిష్టంభన నెలకొంది.
స్పీకర్‌గా సభ్యుల మద్దతు సాధించడంలో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కెవిన్
మెక్‌కార్తీ విఫలమయ్యారు. దీంతో స్పీకర్‌ను ఎన్నుకోకముందే సభ వాయిదా పడింది.
164ఏళ్లలో స్పీకర్ ఎన్నికకు సుదీర్ఘ సమయం పట్టిన ఘటన ఇదే. ఈ నేపథ్యంలోనే
స్పందించిన ఎలాన్ మస్క్ తన మిత్రుడు, సీనియర్ సభ్యుడు కెవిన్ మెక్‌కార్తీ
స్పీకర్ కావాలని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అయితే, కెవిన్‌కు మస్క్ మద్దతు
తెలపడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. మస్క్ అంతటితో
ఆగలేదు. విమర్శలపైనా ట్విటర్లో పోలింగ్ నిర్వహించారు. ‘రాజకీయాలకు దూరంగా
ఉండాలా..? మరిన్ని ఇబ్బందులు పడాలా?’ అని ప్రశ్నిస్తూ ఎలాన్ మస్క్ ఓటింగ్
చేపట్టారు. ఇందులో మొత్తం 5.95లక్షలమంది పాల్గొనగా వారిలో 42.8శాతం మంది
రాజకీయాలకు దూరంగా ఉండాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా 57.2శాతం
మంది మంత్రి మస్క్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనంటూ ఓటు వేశారు. దీంతో
కొన్ని అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని పేర్కొంటూ ఎలాన్ మస్క్ ట్వీట్
చేశారు. అమెరికా రాజకీయాల గురించి ఎలాన్ మస్క్ మాట్లాడటం కొత్తేమీ కాదు.
ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ
రిపబ్లికన్లకు మద్దతు ఇస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మెక్‌కార్తీ చేపట్టిన
నిధుల సమీకరణకూ సహాయం చేశారు. వీటితోపాటు ఉక్రెయిన్ యుద్ధం, మాజీ స్పీకర్
నాన్సీ పెలోసి భర్తపై దాడి వంటి అంశాలపైనా ఎలాన్ మస్క్ స్పందించారు.