అమెరికా : వీసా ఇంటర్వ్యూలో ఒకదఫా విఫలమైన విద్యార్థులకు శుభవార్త. మరోసారి
ఇంటర్వ్యూకు హాజరయ్యే వెసులుబాటు కల్పించాలని అమెరికా ప్రభుత్వం
నిర్ణయించింది. ఫాల్ సీజన్‌కు సంబంధించి ఢిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు
ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయాల్లో
విద్యార్థి వీసా(ఎఫ్-1) దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వారాంతంలోగా
ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణంగా ప్రతి సీజన్లో ఎన్ని దఫాలైనా ఇంటర్వ్యూకు
హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. గడిచిన ఏడాది నుంచి ఒక్కో
విద్యార్థి, ఒక్కసారి మాత్రమే హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో
మార్పులు చేసింది. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియ దాదాపు ముగిసే సమయంలో ఒకసారి
ఇంటర్వ్యూలో విఫలమైన వారికి రెండోసారి హాజరయ్యే అవకాశం కల్పిస్తోంది. ఆ
ప్రకారం వీసా ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం
తాజాగా నిర్ణయించింది. దేశంలోని అయిదు కార్యాలయాల్లో(దిల్లీ, ముంబయి, చెన్నై,
కోల్‌కతా, హైదరాబాద్) ఈ సదుపాయాన్ని కల్పించనుంది. కచ్చితమైన తేదీని
ప్రకటించకపోయినప్పటికీ తొలి వారంలో స్లాట్లు విడుదల చేసే అవకాశాలున్నాయని
అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేస్తోంది. స్లాట్లు విడుదల చేసిన తర్వాత
నిమిషాల వ్యవధిలో పూర్తవుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి,
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది.