63 మంది మరణించారని రష్యా అంగీకారం
కీవ్ : ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి
దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో
రష్యా సైనికులు బసచేసిన శిబిరంపై జెలెన్స్కీ సేన అమెరికా తయారీ ‘హిమార్స్’
రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు హతమయ్యారని, మరో
300 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది. వీరంతా దొనెట్స్క్
ప్రాంతంలోని మకివ్కాలో ఒక వృత్తి విద్యా పాఠశాలలో బసచేసి ఉండగా దాడి జరిగింది.
తమకు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, మృతిచెందింది 63 మంది అని రష్యా రక్షణ శాఖ
సైతం అంగీకరించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి
రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత
ఈ దాడి జరిగినట్లు సమాచారం.
రష్యా వైపు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్వతంత్ర సంస్థల నుంచి ధ్రువీకరణ లేదు.
లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో తాకడంలో హిమార్స్ రాకెట్లకు తిరుగులేదు. వీటి
సాయంతో జెలెన్స్కీ సేన కొంతకాలంగా రష్యా స్థావరాలపై విరుచుకుపడుతోంది.
మకివ్కాలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ
కేంద్రం ఉందని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ రాకెట్ దాడివల్ల అది
విస్ఫోటం చెందిందని వివరించాయి.
కీవ్‌పైకి మరోసారి డ్రోన్లు : ఉక్రెయిన్‌పై మరోసారి డ్రోన్లతో రష్యా దాడికి
దిగింది. కీవ్ దిశగా దాదాపు 40 డ్రోన్లు దూసుకొచ్చాయని నగర మేయర్ విటాలీ
సోమవారం తెలిపారు. వాటన్నింటినీ తమ సైనిక దళాలు కూల్చేశాయని పేర్కొన్నారు.
కీవ్‌లో ఒక చోట జరిగిన పేలుళ్ల వల్ల ఇంధన మౌలిక వసతులు దెబ్బతిన్నాయని
చెప్పారు. ఇవి డ్రోన్ల కారణంగా జరిగాయా లేక శతఘ్ని గుళ్ల వల్ల
చోటుచేసుకున్నాయా అన్నది వెల్లడి కాలేదు. ఈ పేలుళ్ల కారణంగా ఓ యువకుడు
గాయపడ్డాడని విటాలీ తెలిపారు. డి
సెంబరు 31 నుంచి వరుసగా ఇలాంటి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా
క్షిపణులు, డ్రోన్లను కూల్చేయడానికి పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను
ఉక్రెయిన్ వాడుతోంది. తాజాగా 39 ఇరాన్ తయారీ షాహిద్ డ్రోన్లు, రెండు
రష్యన్ ఓర్లాన్ డ్రోన్లను, ఒక ఎక్స్-59 క్షిపణిని ధ్వంసం చేశామని
ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. తమ విద్యుత్ సరఫరా వ్యవస్థను లక్ష్యంగా
చేసుకొని వీటిని ప్రయోగించారని తెలిపింది. దక్షిణ ఖేర్సన్‌పై రష్యా జరిపిన
ట్యాంకు దాడిలో ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మరోవైపు
ఉక్రెయిన్ ప్రయోగించిన ఒక డ్రోన్ రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఒక
విద్యుత్ కేంద్రాన్ని తాకింది. ఫలితంగా ఒక గ్రామానికి కరెంటు
సరఫరా నిలిచిపోయింది.